హైదరాబాద్ కు పొంచివున్న వర్షం ముప్పు... నేడు, రేపు భారీ నుండి అతిభారీ వానలు
తెలంగాణలో నేడు, రేపు కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
హైదరాబాద్ : గత మూడునాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ ప్రజలు తడిసిముద్దవుతున్నారు. హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఇళ్ళకే పరిమితం అయ్యారు. అయితే మరో రెండ్రోజులు(ఆది, సోమవారం) నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందన్న వాతావరణ శాఖ ప్రకటన నగరవాసులను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో జిహెచ్ఎంసి అధికారులు, డిజాస్టర్ మేనేజ్ మెంట్ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. మూసీ పరివాహక ప్రాంతాలతో పాటు చెరువుల సమీపంలో, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించారు.
హైదరాబాద్ లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశాలుండటంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అలాగే రాష్ట్రంలోని 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ రెండ్రోజులే కాదు తర్వాత కూడా వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం వుందని... దీని ప్రభావంతో 25,26(మంగళ, బుధవారం) తేదీల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హెచ్చరించారు. రాజధాని హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలో అతి భారీ కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
Read More మళ్లీ దేశ రాజధానికి వరద ముప్పు.. ప్రమాద స్థాయిని దాటిన యమునా నీటిమట్టం.. అలెర్ట్ అయిన ప్రభుత్వం
ఇక ఇప్పటికే కురిసిన వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతినడంతో పాటు కొన్ని చోట్ల పంట పొలాలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇదే క్రమంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందన్న హెచ్చరికల నేపథ్యంలో జిహెచ్ఎంసి అధికారులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అప్రమత్తం చేసారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా నగరంలోని ప్రస్తుత పరిస్థితులను జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్‌ను మంత్రి అడిగి తెలుసుకున్నారు.
"హుస్సేన్ సాగర్‌కు ఎగువ నుంచి భారీ ఎత్తున నీరు వస్తుంది. నీటి లెవెల్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. దిగువకు నీటి విడుదల జరుగుతున్నందున లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలి. ప్రజల నుంచి వచ్చే పిర్యాదులపై వెంట వెంటనే స్పందిస్తూ అవసరమైన సేవలను అందించాలి. మరో 2, 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అన్ని స్థాయిలలోని అధికారులు అప్రమత్తంగా ఉండాలి." అని మంత్రి ఆదేశాలు ఇచ్చారు.
హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌కు భారీగా వరద నీరు చేరుతోంది. ఎఫ్టీఎల్ 513. 41 మీటర్లు కాగా.. 513.62 మీటర్లకు సాగర్ నీటిమట్టం చేరింది. హుస్సేన్ సాగర్ నీటిమట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటింది. 3 తూముల ద్వారా దిగువ ప్రాంతాలకు నీళ్లను వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.