వాస్తు పై వివాదాలు

vasthu
Highlights

  • తెలంగాణాలో వాస్తు రచ్చ పెద్దదవుతోంది
  • కెసిఆర్ కు వ్యతిరేకంగా న్యాయస్ధానికి వెళ్ళిన విపక్షాలు

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వాస్తు నమ్మకాలపై తెలంగాణా వ్యాప్తంగా పెద్ద ఎత్తున వివాదం మొదలైంది. వాస్తుశాస్త్రంపై నమ్మకం అన్నది వ్యక్తిగతమైనప్పటికీ ప్రభుత్వ భవనాలను కూలగొట్టాలని కెసిఆర్ తీసుకున్న నిర్ణయం తీరువల్ల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద రచ్చే జరుగుతోంది. ప్రతిపక్షాలైన కాంగ్రెస్, టిడిపి, భాజపాలు ఏకంగా న్యాయస్ధానాన్నే ఆశ్రయించటం గమనార్హం. ప్రతిపక్షాల పిటీషన్ ను విచారిణకు స్వీకరించిన న్యాయస్ధానం కూడా వాస్తు నమ్మకం పేరుతో సచివాలయ భవనాలను ఏ విధంగా కూలుస్తారని ప్రశ్నించింది.

  అయితే, కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది మాట్లాడుతూ, సచివాలయం భవనాలను కూలగొట్టాలన్న ప్రభుత్వ నిర్ణయానికి సిల్లీ కారణాలను చూపటంతో  మరింత వివాదం ముదిరింది. ప్రస్తుత సచివాలయ భవనాలకు వాస్తు బాగాలేదని గతంలో సిఎంలుగా పనిచేసిన వారు అనుకుని ఉంటే కెసిఆర్ అసలు ఇపుడు సిఎం అయ్యే వారే కాదేమో. ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే వారి సంతానమే తదుపరి ముఖ్యమంత్రి కావాలని అప్పటి సిఎంలు అనుకుని ఉంటే అసలు ప్రతిపక్షాలెందుకు, రాజకీయాలెందుకన్న ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది.

  ఇదేమీ రాచరికం కాదని, ప్రజాస్వామ్యమన్న విషయాన్ని కెసిఆర్ మరచిపోయినట్లు కనబడుతోందని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. కెసిఆర్ తనను తాను మహారాజుగాను తన కుమారుడు కె. తారకరామారావును యువరాజు గాను భావిస్తున్న కెసిఆర్ తన తదనంతరం కెటిఆరే తెలంగాణాకు సిఎం కావాలని ఆశించటమే అసలు ఈ వివాదానికి మూల కారణంగా కాంగ్రెస్ నేత, పార్లమెంట్ సభ్యుడు మధుయాష్కి ఎద్దేవా చేస్తున్నారు.

తెలంగాణా రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధికారంలోకి వచ్చిన దగ్గర నుండీ రాష్ట్రంలో కుటుంబపాలనే నడుస్తోందన్న ఆరోపణలకు కొదవేలేదు. తండ్రి సిఎం, కుమారుడు మంత్రి, కూతురు ఎంపి, మేనల్లుడు మరో మంత్రి, బందువుల్లో కొందరు సిఎం కార్యాలయంలో కీలక స్ధానాల్లో ఉన్నారని ప్రజాసంఘాల నేతలు కూడా పలువురు ఎద్దేవా చేస్తున్నారు.

   ఒకవేళ తన తర్వాత తన కుమారుడే సిఎం కావాలని కెసిఆర్ అనుకుంటున్నట్లే దేశంలోని మిగిలిన ముఖ్యమంత్రులు కూడా అనుకుంటే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని సచివాలయాలను కూడా వాస్తుశాస్త్రం పేరుతో కూల్చేయాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ ఒడిస్సా, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే వారసులు తండ్రులనుండి భర్త నుండి వారసత్వంగా సిఎం పదవిని అందుకున్నారు.

కర్నాటకలో దేవేగౌడ తర్వాత కుమారస్వామి గౌడ కూడా సిఎంగా చేసినా ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసిన కాలం మధ్య చాలా కాలం గ్యాప్ వచ్చింది. ఇదే నేపధ్యంలో పనిలో పనిగా ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు గురించి కూడా చర్చ జరుగుతోంది. రాజధాని అమరావతి నిర్మాణంలో జరుగుతున్న జాప్యానికి కూడా వాస్తుశాస్త్రమే కారణమేమో అని పలువురు అనుకుంటున్నారు. తన తర్వాత కుమారుడు లోకేష్ ముఖ్యమంత్రి అవ్వటానికి వాస్తు ప్రకారం తగ్గ భవనాల డిజైన్లు దొరకకే చంద్రబాబు కూడా పలు డిజైన్లను తిరస్కరించారేమోనని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

 

loader