ఇటలీలో భారత రాయబారిగా హైదరాబాద్ కు చెందిన వాణి సర్రాజురావు
ఇటలీలో భారత రాయబారిగా హైదరాబాద్ కు చెందిన వాణి సర్రాజురావును నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఢిల్లీ : హైదరాబాద్ కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి వాణి సర్రాజు రావు ఇటలీలో భారత రాయబారిగా నియమితులయ్యారు. ఆమె 1994 బ్యాచ్ కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి. శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వం ఆమెను ఇటలీలో రాయబారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వాణి సర్రాజు రావు విదేశాంగ శాఖలో అదనపు కార్యదర్శి హోదాలో పని చేస్తున్నారు. వాణి విద్యాభ్యాసం అంతా హైదరాబాదులోనే కొనసాగింది. ఆ తర్వాత ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లారు. అక్కడి కాలిఫోర్నియాలోని సాన్ జోస్ స్టేట్ యూనివర్సిటీలో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ లో ఎమ్మెస్ చేశారు.
గతంలో కూడా ఆమె అనేక పదవులను చేపట్టారు. అమెరికాస్ డివిజన్ డైరెక్టర్, స్వీడన్ లోని భారత రాయబార కార్యాలయం ఫస్ట్ సెక్రటరీ, విదేశాంగ శాఖ కార్యాలయంలో యూరప్ వెస్ట్ విభాగాల అండర్ సెక్రెటరీగా సేవలు చేశారు. మెక్సికో సిటీలోని భారత రాయబార కార్యాలయంలో తొలి పోస్టింగ్ కింద పని చేశారు. 2011 నుంచి 2014 వరకు ఇజ్రాయిల్ లోని భారత రాయబార కార్యాలయంలోని వాణిజ్య విభాగం అధిపతిగా.. మిషన్ డిప్యూటీ చీఫ్ గా సేవలందించారు. 2017 నుంచి 2020 వరకు ఫిన్లాండ్, ఎస్తోనియా రాయబారిగా పని చేశారు.