నిజామాబాద్: తెలంగాణ రైతన్నలను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. యూరియా కోసం క్యూలో నిలబడలేక ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి నెలకొంది. సిద్ధిపేట జిల్లా దుబ్బాక వ్యవసాయ మార్కెట్ వద్ద ఎల్లయ్య అనే రైతు మృతి చెందిన ఘటన మరువకముందే నిజామాబాద్ జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. 

జిల్లాలోని ఇందల్వాయి సహకార సంఘం వద్ద ఓ మహిళా రైతు స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే స్థానిక రైతులు ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సరిపడా యూరియా దొరక్కపోవడంతో రైతులు ఉన్న యూరియా కోసం తెల్లవారు జామున మూడు గంటల నుంచే క్యూ లైన్లో నిలబడి ఉంటున్నారు. 

రైతులు క్యూ లైన్లో నిలబడలేక చనిపోతున్నా, స్పృహతప్పి పడిపోతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. దాంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరత లేదని ప్రభుత్వం ప్రకటనలు ఇస్తున్నా సహకార సంఘాల వద్ద మాత్రం స్టాక్ లేదంటున్నారని రైతులు వాపోతున్నారు. 

స్టాక్ కొంతమాత్రమే ఉందని సిబ్బంది చెప్పడంతో ఇంటిల్లపాది 3 గంటల నుంచే ఇందల్వాయి సహకార సంఘం వద్ద రైతులు బారులు తీరినట్లు రైతులు చెప్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

విషాదం: యూరియా కోసం క్యూలైన్లో నిలబడ్డ రైతు మృతి

యూరియా కోసం క్యూలో నిలబడ్డ రైతు మృతి: ప్రభుత్వ హత్య అంటూ కాంగ్రెస్ మండిపాటు