సిద్ధిపేట: దుబ్బాక వ్యవసాయ మార్కెట్ వద్ద రైతు ఎల్లయ్య మృతిపై రాజకీయ వివాదం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం చేతకానితనం వల్లే రైతు చనిపోయాడని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే రైతు మృతికి యూరియా కొరతకు ఎలాంటి సంబంధం లేదని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. 

వివరాల్లోకి వెళ్తే సిద్ధిపేట జిల్లా దుబ్బాక వ్యవసాయ మార్కెట్ వద్ద యూరియా కోసం రైతు ఎల్లయ్య క్యూలో ఉన్నాడు. అయితే ఆకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు ఎల్లయ్య ప్రాణాలు వదిలాడు. అయితే ఎల్లయ్య మృతిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 

యూరియా కోసం రైతు చనిపోవడం తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన సిగ్గు చేటుగా భావిస్తున్నట్లు విమర్శించారు. యూరియా కోసం రైతు చనిపోయిన దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. 

యూరియా కోసం ఇంకా వేల మంది రైతులు కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో ఉన్నారని తెలిపారు. ముందు చూపు లేని ప్రభుత్వ తీరుతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమయానికి రుణమాఫీ చేయకుండా రైతులను ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. 

మరోవైపు మల్లు భట్టి విక్రమార్క ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి నిరంజన్ రెడ్డి. దుబ్బాకలో రైతు మృతికి, యూరియా కొరతకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.  రైతు మృతి యాదృచ్చికంగా జరిగిందని తెలిపారు. గుండెపోటుతో రైతు ఎల్లయ్య మృతిచెందారని స్పష్టం చేశారు.  

తెలంగాణకు రావాల్సిన యూరియాను కర్ణాటకకు మళ్లించారని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. యూపీ, బిహార్‌లో వరదల కారణంగా అక్కడి నుంచి రావాల్సిన యూరియా ట్రక్కులు ఆలస్యంగా వచ్చాయని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో యూరియా స్టాక్‌ సరిపడా ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి నిరంజన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు.