ఇప్పటికీ అసలు 2 వేల రూపాయల నోట్లను ప్రజలు చాలామంది చూడకపోవటంతో దొంగనోట్లనే అసలైన నోట్లుగా భ్రమపడి, పాత వెయ్యి, 500 రూపాయల నోట్లను సమర్పించుకుంటున్నారు.

పెద్ద నోట్ల రద్దులో ప్రధానమంత్రికి ముందు చూపులేని కారణంగా దేశవ్యాప్తంగా అనేక అనర్ధాలు జరుగుతున్నాయి. దాంతో ప్రభుత్వ డొల్లతనం బయటపడుతున్నది. ఫలితంగా దొంగనోట్లు, ప్రింటిగ్ సరిగాలేని ఒరిజినల్ నోట్లు విస్తృతంగా మార్కెట్లో చెలామణిలోకి వచ్చేసాయి. దాంతో ఏది అసలో, ఏది నకిలీ నోటో తెలుసుకోలేక ప్రజలు బిత్తరపోతున్నారు.

ప్రధాని అనాలోచిత నిర్ణయం వల్ల దేశ ఆర్ధిక వ్యవస్ధే దాదాపు కుదేలవుతోంది. బ్యాంకులు, ఏటిఎంల ముందు బారులు తీరి నిలబడుతూ 14 రోజులుగా ప్రజలు నానా అవస్తలు పడుతున్నారు. రోజుల తరబడి బారులు తీరుతుండటంతో ఒత్తిడి తట్టుకోలేక ఇటు ప్రజలు, అటు బ్యాంకు సిబ్బంది కూడా మృతిచెందుతున్నారు.

చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో 86 శాతమున్న వెయ్యి, 500 రూపాయల నోట్లు హటాత్తుగా రద్దవటంతో ప్రజలకు నరకం కనబడుతోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లోని ప్రజలకు డబ్బు అందుబాటులోకి రాకపోవటంతో బ్యాంకులు, ఏటిఎంలపై దాడులు చేస్తున్నారు. సాఫ్ట్ వేర్లలో వచ్చిన ఇబ్బందుల కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న 2 లక్షల ఏటిఎంల్లో 2 వేల నోట్లు బయటకు రాలేదు. ఇప్పటి వరకూ 70 వేల ఏటిఎంల్లో సాఫ్ట్ వేర్లు మార్చింది.

2 వేలు, 500 రూపాయల నోట్లను ప్రజలకు త్వరగా అందించాలన్న తాప్రయంతో ఆర్బిఐ తప్పటడుగులు వేస్తోంది. వందల కోట్ల రూపాయల విలువైన 2 వేలు, 500 రూపాయల నోట్ల ముద్రణ సరిగా లేకుడానే చెలామణిలోకి వచ్చేస్తోంది. మరికొన్ని వందల కోట్ల విలువైన 2 వేలు, 500 రూపాయల నోట్లపై ఆర్బిఐ గవర్నర్ సంతకం లేకుండానే ప్రింటై చెలామణిలోకి వచ్చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

పలు నగరాల్లో వివిధ బ్యాంకుల ఏటిఎంల నుండే కాక బ్యాంకు కౌంటర్లలో కూడా సగం ముద్రితమైన రూ. 500 నోట్లు చెలామణిలోకి వచ్చేస్తున్నాయి. తొందరలోనో లేక చేతికి నగదు దక్కిందన్న ఆనందంతోనో ప్రజలు డబ్బు అందగానే వెంటనే ఇళ్లకు, బజార్లకు పరుగులు తీస్తున్నారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత చూసుకుంటే ముద్రణలోపాలున్న నోట్లు కనబడుతున్నాయి.

ఇదే అదునుగా 2 వేల రూపాయల విలువైన దొంగనోట్లు విస్తృతంగా చెలామణిలోకి వచ్చేసింది. ఇప్పటికీ అసలు 2 వేల రూపాయల నోట్లను ప్రజలు చాలామంది చూడకపోవటంతో దొంగనోట్లనే అసలైన నోట్లుగా భ్రమపడి, పాత వెయ్యి, 500 రూపాయల నోట్లను సమర్పించుకుంటున్నారు.

విజయవాడలో మొన్న 16 లక్షల విలువైన పాత రూ .వెయ్యి, రూ. 500 నోట్లు ఇచ్చి కొత్త రూ. 2 వేల నోట్లను ఒక వ్యాపారి తీసుకున్నారు. అయితే, ఆ తర్వాత తాను తీసుకున్న 2 వేల నొట్లు మొత్తం దొంగనోట్లని తెలియటంతో సదరు వ్యాపారి లబోదిబోమంటూ పోలీసు స్టేషన్ కు పరిగెత్తారు. ఇటువంటి సంఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నట్లు సమాచారం.