కొడంగల్ నియోజకవర్గంలో కీలక పరిణామాలు వ్యూహాత్మకంగా రంగంలోకి దిగిన టిఆర్ఎస్ భారీ మార్పులు.. రేవంత్ వర్గంలో అలజడి అధికార టిఆర్ఎస్ కు సహకరిస్తున్న టిడిపి
తెలంగాణ, ఎపి రాజకీయాల్లో రేవంత్ రెడ్డి హాట్ టాపిక్ గా మారిపోయిండు. ఏకకాలంలో అటు టిడిపికి, ఇటు టిఆర్ఎస్ కు రేవంత్ రెడ్డి కొరకరాని కొయ్యగా మారిండు. ఆ రెండు పార్టీల నేతలకు ఏకకాలంలో ఇరుకునబెడుతున్నడు రేవంత్ రెడ్డి. దీంతో వ్యూహాత్మక రాజకీయాలు నడపడంలో ఆరితేరిన టిఆర్ఎస్ కూడా గేమ్ ప్లాన్ స్టార్ట్ చేసింది. గులాబీ దెబ్బకు రేవంత్ శిబిరంలో అలజడి మొదలైందా? అంటే రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానం వస్తోంది.
గత కొంతకాలంగా టిడిపి వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. పక్కా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారు. గత ఐదారు నెలల కాలంగా కాంగ్రెస్ తో కలిసి ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తూ వచ్చారు. యావత్ తెలంగాణ టిడిపిని కాంగ్రెస్ తో ఫ్రెండ్ షిప్ చేసేలా పావులు కదిపారు. ఆ దిశగా తెలంగాణలో ఉన్న టిడిపి శ్రేణులు సైతం రేవంత్ వంట నడిచాయి. టిడిపి శ్రేణుల్లో టిఆర్ఎస్ పై తీవ్రమైన వ్యతిరేక భావం నింపడంలో, కాంగ్రెస్ పట్ల సానుకూలత రావడంలో రేవంత్ కీలకమైన భూమిక పోశించారు. దీంతో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపి కలిసి పోటీచేస్తాయన్న వాతావరణం తీసుకొచ్చారు.
ఈ విషయంలో తాజాగా మరో ముందడుగు వేశారు రేవంత్. టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పలు సందర్భాల్లో కలిశారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత మామ వరుస అయిన జైపాల్ రెడ్డితోనూ టచ్ లో ఉన్నారు. దీంతో ఏ క్షణంలో రేవంత్ కాంగ్రెస్ లోకి వచ్చినా తమకు సమ్మతమే అని కాంగ్రెస్ రేవంత్ కోసం తలుపులు బార్లా తెరిచింది. ఇక ఈ తరుణంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు రేవంత్. పైగా తాను రాహుల్ ను కలిస్తే తప్పేంటి అంటూ పార్టీలో తనను విమర్శించిన వారికి ఎదురు ప్రశ్న వేశారు. దీనికితోడు రాహుల్ ను కలిసిన మరుసటిరోజే వ్యూహాత్మకంగా ఎపి టిడిపి నేతల బట్టలూడదీశారు. ఈ మాటలన్నీ ఆర్ రికార్డ్ గా కాకుండా చిట్ చాట్ లో తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఎపి, తెలంగాణలో ఎపి టిడిపి నేతలను, తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒకే గాట కట్టి ఎటాక్ చేశారు.
దీంతో టిడిపి శిబిరంలో కల్లోలం షురూ అయింది. వెంటనే మీటింగ్ పెట్టారు. దానికి రేవంత్ రాడని టిడిపి నేతలు భావించారు. అయినా రేవంత్ ఆ మీటింగ్ కు వచ్చి తెలంగాణ టిడిపి నేతలను పూర్తిగా ఇరకాటంలో పడేశారు. మీటింగ్ లో ఏం మాట్లాడాలో తెలియక మోత్కుపల్లి, అరవింద్ కుమార్ గౌడ్ లు సమావేశం నుంచి వాకౌట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు రేవంత్ వ్యూహాత్మకంగా నడిచారు. ఆయన అనుకున్నట్లే వ్యవహారం నడిచింది.
అంతలోనే రేవంత్ శిబిరంలో కల్లోలం మొదలైంది. రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరులు టిఆర్ఎస్ బాటు పట్టారు. రేవంత్ కాంగ్రెస్ దారిలోకి వెళ్తే మా దారి మేము చూసుకుంటామంటూ మద్దూరు జెడ్పీటీసి బాల్ సింగ్, సర్పంచ్ వెంకటయ్య టిఆర్ఎస్ వైపు అడుగులేశారు. రేవంత్ రెడ్డికి ఇది ఊహించని షాక్ గానే చెబుతున్నారు. టిడిపిలో తను అనుకున్న రీతిలోనే పరిణామాలు జరిగినప్పటికీ టిఆర్ఎస్ రంగంలోకి దిగడంతో ఊహించని పరిణామాలు మొదలయ్యాయి.
మరి ఇక రేవంత్ శిబిరంలో టిఆర్ఎస్ మునుం పెట్టింది. ఇది ఇంతటితోనే ఆగిపోతుందా? లేకపోతే మరిన్ని గ్రామాల్లో, మరిన్ని మండలాల్లో కూడా రేవంత్ వర్గాన్ని కొల్లగొడుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఒక జెడ్పీటిసి, ఒక సర్పంచ్ ను టిఆర్ఎస్ గుంజుకున్నది. రాజున్న రోజుల్లో మరింత మందికి వల వేసి గుంజుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు ఇప్పుడు టిడిపి కూడా టిఆర్ఎస్ కు సపోర్ట్ చేసి పాత టిడిపి వాళ్లందిరనీ టిఆర్ఎస్ గుంజుకునేలా సహకరించే అవకాశాలు కూడా లేకపోలేదని అంచనాల్లో ఉన్నాయి రాజకీయ వర్గాలు.
ఈ నేపథ్యంలో తన శిబిరంలో మునుం పెట్టిన టిఆర్ఎస్ ను రేవంత్ ఎలా డీల్ చేస్తాడన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన తన శిబిరాన్ని కాపాడుకుంటారా? టిఆర్ఎస్ వ్యూహాన్ని ఎలా ఎదుర్కొంటారు? గతంలో ఓటుకు నోటు విషయంలో టిఆర్ఎస్ వలలో చిక్కినట్లు మరోసారి కూడా టిఆర్ఎస్ వలలో చిక్కుతారా? అన్నది ఇఫ్పుడు తేలాల్సిన విషయం.
మహిళలను వేధిస్తున్న హైదరాబాద్ జర్నలిస్టు వీడియోతోపాటు మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
