Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్‌కి కిషన్ రెడ్డి లేఖ: హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్ పున: సమీక్షించాలి

హెచ్.ఎం.డి.ఎ మాస్టర్ ప్లాన్ ను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పునః సమీక్షించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గురువారం నాడు  తెలంగాణ సీఎం కేసీఆర్ కు  లేఖ రాశారు. 

union minister Kishan Reddy writes letter to KCR lns
Author
Hyderabad, First Published Apr 15, 2021, 2:15 PM IST

హైదరాబాద్:హెచ్.ఎం.డి.ఎ మాస్టర్ ప్లాన్ ను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పునః సమీక్షించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గురువారం నాడు  తెలంగాణ సీఎం కేసీఆర్ కు  లేఖ రాశారు. ప్రభుత్వం, ప్రజలు, ముఖ్యంగా రైతులు ఆశించిన విధంగా  హెచ్ఎండీఏలో  అభివృద్ధి ప్రణాళికలు అమలు జరగడం లేదని అనేక ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయన్నారు. 

పరిధి పెద్దగా ఉండడంతో పాటు క్షేత్ర స్థాయిలో సరైన అవగాహన లేక సంబంధిత స్థానిక సంస్థలతో సమన్వయ లోపం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.అక్రమ నిర్మాణాలు పెరుగుతూ క్రమ పద్దతిలో జరగవలసిన అభివృద్ధి అక్రమాలకూ అవినీతికి అవకాశం కల్పిస్తోందన్నారు.

అంతేకాకుండా రైతులు కూడా మాస్టర్ ప్లాన్ తమకు అనుకూలంగా లేదని భూములను వివిధ జోన్లుగా మార్చే విషయంలో తమ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని తన దృష్టికి తెచ్చారని ఆయన తెలిపారు. రైతులు తమ భూములను ఇతర జోన్లకు అంటే నివాస, పారిశ్రామిక, వ్యాపార తదితర జోన్లలోకి మార్చుకోవడానికి చాలా కాలం ఎదురుచూడాల్సి వస్తోంన్నారు. దీంతో అక్రమ నిర్మాణాలకు అవకాశం ఏర్పడుతోందని మంత్రి తెలిపారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత హెచ్.ఎం.డి.ఎ మాస్టర్ ప్లాన్ ను సమీక్షించి రైతులకు అనుకూలంగా సమగ్ర మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తామని ప్రభుత్వం పలుసార్లు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.   ఇది ఖర్చుతో కూడిన పని కూడా కాదు. మారిన పరిస్థితులకు అనుగుణంగా రైతులు, పేద, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని మార్పులు చేర్పులు చేయవలసిన అవసరం ఎంతైనా వుందన్నారు.

పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన భూములు తప్ప ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలోని మిగతా భూములన్నింటినీ నివాస (రెసిడెన్సియల్), జోన్లుగా మారిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని రైతులు భావిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.హెచ్.ఎం.డి.ఎ – స్థానిక సంస్థల మధ్య సమన్వయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. . అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు స్థానిక సంస్థలతో కలిసి ఉమ్మడిగా కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందని ఆయన ఆ లేఖలో కోరారు. 

నిర్మాణ అనుమతులకై తీసుకువచ్చిన డీపీఎంఎస్  సమర్థవంతంగా అమలయ్యేట్టు చూడాలన్నారు. ఘట్‌కేసర్, గౌడవెల్లి, నాగులపల్లి, శంషాబాద్ ల వద్ద ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్లపై రైల్వే లైన్లు వచ్చిన ప్రదేశాల్లో బ్రిడ్జ్ లు నిర్మించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని రేడియల్ రోడ్లను పూర్తిచేయాలని ఆయన కోరారు. 

రాజేంద్రనగర్, శంషాబాద్, నార్సింగి, పటాన్ చెరు, శంబీపూర్ తదితర ప్రాంతాలలో సర్వీస్ రోడ్లను పూర్తిచేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. 
ప్రధాన రింగ్ రోడ్డు, సర్వీస్ రోడ్లకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని ఆయన కోరారు. ఔటర్ రింగ్ రోడ్డు డివైడర్లపై చెట్లు పెంచడం, పొదలను తొలగించడం సరైన పద్ధతిలో చేయాలని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios