కోవిడ్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత రాకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి . ఆదివారం హైదరాబాద్‌ గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రిని ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... సుమారు 600 మంది కరోనా బాధితులు టిమ్స్‌లో చికిత్స పొందుతున్నారని చెప్పారు.

వీరిలో వంద మంది ఐసీయూలో ఉండగా.. 50 మంది సాధారణ చికిత్స తీసుకుంటున్నారని కిషన్ రెడ్డి వెల్లడించారు. టిమ్స్‌కు ప్రత్యేకంగా 200 వెంటిలేటర్లను కేంద్ర ప్రభుత్వం సమకూర్చిందని.. ఇక్కడ వెంటిలేటర్ల సమస్య లేదని ఆయన పేర్కొన్నారు.

Also Read:ప్రాణాలు పోతుంటే.. మీకు రాజకీయాలు కావాలా: కేసీఆర్‌ ఫ్యామిలీపై కిషన్ రెడ్డి విమర్శలు

ఆక్సిజన్ కోసం ఎన్‌ఆర్‌బీ పరికరాలు సైతం అందుబాటులో ఉన్నాయని.. అయితే కొంత మేర మాస్కుల కొరత ఉందని కిషన్ రెడ్డి అంగీకరించారు. ప్రకృతి విపత్తుల సమయంలో వినియోగించుకునేందుకు రాష్ట్రాల దగ్గర అత్యవసర నిధి ఉంటుందని.. నిధుల కొరత ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిధిని వాడుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం అవసరమైనంత వరకు కొవిడ్‌ని అరికట్టేందుకు వాటిని వినియోగించుకోవాలని కేంద్రమంత్రి సూచించారు. టిమ్స్‌లో 700 రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు ఉన్నాయని.. దేశంలోని పలు కంపెనీలకు ఆక్సిజన్ ఉత్పత్తి చేయడానికి కేంద్రం అనుమతి ఇచ్చింని వీటికి తోడు సింగపూర్, జర్మనీల నుంచి ఆక్సిజన్ దిగుమతి చేసుకుంటున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కొవిడ్‌ నివారణ చర్యల మీద దృష్టి సారించాలని ఆయన హితవు పలికారు. కొవిడ్‌ పరీక్షల్లో పాజిటివ్ వచ్చినా మాస్క్ వంటి కనీస జాగ్రత్తలు తీసుకోకుండా కొంత మంది స్వేచ్ఛగా బయట తిరుగుతూ తోటి వారి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారని కిషన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలాంటి వాళ్ల వల్ల కరోనా తీవ్రత పెరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వీరిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. స్థానిక ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు చేయాల్సినవి, తీసుకోవాల్సినవి చేస్తున్నాయని ప్రజలు అవగాహన పెంచుకుని ప్రభుత్వాలకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన నిర్ణీత ధర కంటే ఎక్కువ ధరకి రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ విక్రయించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని కిషన్ రెడ్డి హెచ్చరించారు.