ఏపీలో జ‌న‌సేన‌, బిజేపీ పొత్తు స‌రిగానే ఉన్నా.. తెలంగాణలో మాత్రం బెడిసికొట్టింద‌నే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఎమ్మెల్సీ ఎన్నిక‌లే ఉదాహర‌ణ‌గా చెబుతున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు.

వాస్త‌వానికి జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో ఏర్పడిన దూరం ఇరు పార్టీల మ‌ధ్య ఎమ్మెల్సీ ఎన్నిక‌ల స‌మ‌యానికి పీక్స్‌కు చేరింది. ఈ విభేధాల్లో భాగంగానే తెలంగాణ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అభ్య‌ర్ధి సురభి వాణీదేవికి ప‌వ‌న్ కల్యాణ్ మ‌ద్ద‌తు తెలిపారు.

అయితే తాజా నాగ‌ర్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో జ‌న‌సేనాని స్పందనపై బీజేపీ కేడ‌ర్ తో పాటు నేత‌ల్లో టెన్షన్ వాతావరణం నెల‌కొంది. దీంతో ఇప్పుడు ప‌వ‌న్‌ను ఎలాగైనా మ‌చ్చిక చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు తెలంగాణ బీజేపీ నేత‌లు.

దీంతో అలర్ట్ అయిన కేంద్ర పెద్దలు..  కిష‌న్ రెడ్డిని రంగంలోకి దించిన‌ట్లు స‌మాచారం. తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్ ప‌ట్ల ప‌వ‌న్‌కు తొలి నుంచి స‌రైన అభిప్రాయం లేదనే టాక్ వినిపిస్తోంది.

దీంతో ఈ వ్య‌వ‌హారంపై పవన్‌తో చ‌ర్చలు జరిపి రాజీ కుదిర్చే బాధ్యతను కిష‌న్ రెడ్డికి పెద్ద‌లు అప్ప‌గించిన‌ట్లుగా విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. ఇందులో భాగంగానే త్వ‌ర‌లో కిష‌న్ రెడ్డి.. ప‌వ‌న్ తో భేటీ కాబోతున్న‌ట్లు తెలుస్తోంది. సాగ‌ర్ ఉప ఎన్నిక‌లో బీజేపీకి మ‌ద్ద‌తు ఇవ్వాని, అలాగే ప్రచారం నిర్వహించాలని కిష‌న్ రెడ్డి.. ప‌వ‌న్‌ను కోర‌బోతున్న‌ట్లు స‌మాచారం.

Also Read:ఎవరి లెక్కలు వారివే: పార్టీల భవిష్యత్ తేల్చేది సాగర్ ఎన్నికనే...

దీంతో పాటు త్వ‌ర‌లో ఈ ఎన్నికు సంబంధించి కేంద్ర పెద్ద‌లు కూడా ప‌వ‌న్‌తో సంప్రదింపులు జరిపే అవకాశం వుంది. ఇదిలా ఉంటే జ‌న‌సేన పార్టీ త‌రుపున నాగ‌ర్జున సాగ‌ర్ నుంచి బ‌రిలో నిలిచెందుకు ప‌లువురు ప‌వ‌న్‌ వద్ద ప్ర‌తిపాద‌న‌లు పెట్టారు.

2019లో న‌ల్గొండ ఎంపీ అభ్య‌ర్ధిగా వేముల స‌తీష్ బ‌రిలో నిల్చుంటే ఆయ‌న‌కు కేవ‌లం 1100 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. అయితే సాగ‌ర్‌లో త‌మ‌కు గ‌ట్టిప‌ట్టుంద‌ని జనసైనికులు వాదిస్తున్నారు.

వాస్త‌వానికి దుబ్బాక ఎన్నిక‌ల్లోనే ప‌వ‌న్ వ‌చ్చి ప్ర‌చారం చేస్తారని జోరుగా ప్ర‌చారం న‌డిచింది. అయితే కొన్ని కార‌ణాలు, ఇతరత్రా స‌మీక‌ర‌ణాలు వ‌ల‌న ప‌వ‌న్ ప్ర‌చారానికి రాలేక‌పోయారు. కానీ సాగర్‌ ఎన్నిక ప్రాధాన్యత దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లో జనసేనానితో సఖ్యంగానే ఉండాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు.