Asianet News TeluguAsianet News Telugu

పాలన గాలికి, డ్రామాలతో బిజీ... కోర్టు మొట్టికాయలేసినా మారని వైఖరి : కేసీఆర్‌పై కిషన్ రెడ్డి ఆగ్రహం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసిందని... అబద్ధాలతో మభ్యపెట్టే ప్రయత్నం చేయడం, గారడి మాటలతో మసిపూసి మారేడు కాయ చేయడం కేసీఆర్‌కే సాధ్యమంటూ ఆయన చురకలంటించారు. 
 

union minister kishan reddy slams telangana cm kcr
Author
First Published Dec 27, 2022, 3:49 PM IST

ప్రజల దృష్టిలో మరల్చేందుకు ఎప్పటికప్పుడు కొత్త నాటకాలు ఆడటం , కొత్త కథలు చెప్పడం , కొత్త కొత్త నటులతో కొత్త సినిమాలు తీయడం టీఆర్ఎస్ పార్టీకి అలవాటుగా మారిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాలనను గాలికొదిలేసి, తన అస్ధిత్వాన్ని కాపాడుకునేందుకు ఇతరుల మీద బురద జల్లడం కల్వకుంట్ల కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య అన్నారు. రాష్ట్రంలో అనేక సందర్భాలలో , రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన న్యాయస్థానాలు సుమోటాగా తీసుకుని మొట్టికాయలు కొట్టిందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. చివరికి రాష్ట్రంలో ప్రజలు తమ నిరసన తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన ఇందిరా పార్క్ దగ్గర  ధర్నాలు చేయరాదని బీఆర్ఎస్ ప్రభుత్వం హుకుం జారీ చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై హైకోర్టు మండిపడిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. 

ప్రజాస్వామ్యంలో ప్రజలు ధర్నాలు చేసుకునేందుకు హక్కు వుందని, ఆపడానికి మీరెవరు అంటూ హైకోర్టు తీర్పునిచ్చిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. న్యాయస్థానాలు మొట్టికాయలు వేసినా వీళ్లకు చీమ కుట్టినట్లయినా వుండదన్నారు. తనకు, తన కుటుంబానికి, తన పార్టీకి ఎవరైనా ప్రత్యామ్నాయంగా వ్యక్తులు కానీ, శక్తులు గానీ ఎదుగుతున్నారంటే వారి ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. పసలేని విమర్శలు చేయడం, అబద్ధాలతో మభ్యపెట్టే ప్రయత్నం చేయడం, గారడి మాటలతో మసిపూసి మారేడు కాయ చేయడం .. అది ఒక్క కేసీఆర్‌కే చెల్లుతుందన్నారు. తన అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకే డ్రామాలు ఆడుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్, నిర్మాతగా కేసీఆర్ తెరకెక్కించిన ఫామ్ హౌస్ ఫైల్స్ సినిమాను విడుదల చేశారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను జీర్ణించుకోలేక  సరిగ్గా మునుగోడు ఉపఎన్నిక సమయంలో ఫామ్‌హౌస్ డ్రామాను ఆడారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. 

ALso REad: ఇక కేసీఆర్‌తో చంద్రబాబు ఆడుకుంటారు.. : జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

ఇదిలావుండగా... బీఆర్ఎస్‌తో తెలంగాణ సెంటిమెంట్‌ను సీఎం కేసీఆర్ చంపేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. టీఆర్ఎస్ నుంచి ‘‘టీ’’ని తొలగించి తెలంగాణను అవమానించారని విమర్శించారు. బీఆర్ఎస్‌తో కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌కు వెళుతున్నారనీ.. అందుకే చంద్రబాబు తెలంగాణకు వచ్చారని అన్నారు. సైలెంట్‌గా ఉన్న చంద్రబాబు తెలంగాణకు రావడానికి కేసీఆర్ అవకాశం ఇచ్చారని చెప్పుకొచ్చారు. సోమవారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ ఏర్పాటు  చేసుకోవచ్చని అన్నారు. బీఆర్ఎస్ కార్యాలయాలు ఎక్కడైన పెట్టుకోవచ్చు అన్నారు. అయితే పార్టీ పేరు నుంచి తెలంగాణ తొలగించడంతోనే కేసీఆర్ బలం పోయిందని చెప్పుకొచ్చారు. రాజకీయంగా బ్రతుకునిచ్చిన చెట్టునే కేసీఆర్ నరికేశారని అన్నారు. 

కేసీఆర్ నిర్ణయం చంద్రబాబుకు తెలంగాణ  రాజకీయాల్లోకి రావడానికి ఇచ్చిన అవకాశం అని అన్నారు. ఇప్పుడు తెలంగాణ పంచాయితీ పోయిందన్నారు. రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ  వచ్చిందని.. అయితే విభజనలో ఉన్న  డిమాండ్ల గురించి జనాలు అడగటం లేదని, నాయకులు పట్టించుకోవడం లేదని చెప్పారు. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్‌తో ఆదరణ పొందలేరని.. అయితే  తెలంగాణలో అట్రాక్ట్ చేయగలరని అన్నారు. చంద్రబాబు ఇక కేసీఆర్‌తో ఆడుకుంటారని అన్నారు. తెలంగాణలో రాజకీయ పార్టీల పొత్తులపై ముందు ముందు తెలుస్తుందని.. ఇక నుంచి చాలా సీరియస్ పాలిటిక్స్ నడుస్తాయని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios