బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకు ‘సేవా హి సంఘటన’ పేరుతో బీజేపీ శ్రేణులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బర్కత్‌పురా బీజేపీ కార్యాలయంలో యువమోర్చా ఆధ్వర్యంలో కరోనా బాధిత కుటుంబాలకు ఆహార పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

పేద ప్రజల కోసం మే, జూన్ నెలల్లో ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున కేంద్రం ఉచిత బియ్యం ఇస్తోందని కిషన్ రెడ్డి వెల్లడించారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ప్రజల అవసరాల మేరకు ఈ సాయాన్ని పొడిగించాలన్న యోచనలో కేంద్రం ఉన్నట్లు ఆయన తెలిపారు.   

దేశవ్యాప్తంగా మాస్కులు, ఇమ్యూనిటీ పెంచే ఆహారాన్ని బీజేపీ శ్రేణులు పంపిణీ చేశాయనీ, లాక్‌డౌన్ ముగిసే వరకు కరోనా బాధిత కుటుంబాలు, పేదలకు యువమోర్చా ఆధ్వర్యంలో ఆహారాన్ని పంపిణీ చేస్తామని కిషన్‌రెడ్డి వెల్లడించారు.

Also Read:నిన్న గాంధీ... నేడు ఏజిఎం... కరోనా రోగులకు సీఎం కేసీఆర్ భరోసా

కేంద్రం పీఎంకేర్ నిధులతో 1405 వెంటిలేటర్స్ కొనుగోలు చేసి తెలంగాణలోని 46 ఆసుపత్రులకు పంపిణీ చేసిందని ఆయన వెల్లడించారు. వీటి నిర్వహణ కోసం అనుభవజ్ఞులైన సిబ్బందిని తీసుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశామని కిషన్ రెడ్డి గుర్తుచేశారు.

ఆసుపత్రులకు అవసరమైన వైద్య సిబ్బందిని తక్షణమే నియమించాలని కేంద్రమంత్రి డిమాండ్ చేశారు. ప్రాణాలకు తెగించి పని చేస్తున్న వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు ప్రకటించాలని కిషన్ రెడ్డి కోరారు.

రాష్ట్రంలో గడిచిన వారం రోజులుగా వ్యాక్సిన్లు ఇవ్వడం లేదని.. దీంతో రెండో డోస్‌ వేయించుకోవాల్సిన వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజకీయ పట్టింపులకు పోకుండా రెండో డోస్ వేసుకునే వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.