Asianet News TeluguAsianet News Telugu

94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ, భయపడం:కేసీఆర్ కు కిషన్ రెడ్డి కౌంటర్

తెలంగాణ సీఎం విమర్శలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటరిచ్చారు. వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం వైఖరిని చెప్పాలని బీజేపీ నేతలను కేసీఆర్ ప్రశ్నించారు.ఈ విషయమై కేంద్రం స్పష్టత ఇచ్చేవరకు వెంటపడుతామని ఆయన తేల్చిచెప్పారు.ఈ విషయమై ఈ నెల 12న ఆందోళనలకు దిగుతామని కూడా కేసీఆర్ ప్రకటించారు.

Union Minister Kishan Reddy Reacts on Telangana CM Comments Over Paddy
Author
Hyderabad, First Published Nov 9, 2021, 12:57 PM IST

న్యూఢిల్లీ:దేశంలో 600 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే 94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్నాన్ని తెలంగాణ నుండే కేంద్రం సేకరించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం నాడు న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.  రెండు రోజులుగా తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంపై, బీజేపీ నేతలపై చేస్తున్న విమర్శలపై మంత్రి స్పందించారు. వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం తన వైఖరిని చెప్పేవరకు తాను మాట్లాడుతానని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

 రెండు రోజులుగా తెలంగాణ సీఎం కేసీఆర్ వాస్తవాలు చెప్పకుండా రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని కేంద్ర మంత్రి Kishan Reddy విమర్శించారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడబోమని Kcrకు కిషన్ రెడ్డి చెప్పారు.2014లో తెలంగాణలో 43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందన్నారు.ఇప్పుడు 151 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. వరి పండించే రైతులకు కేంద్రం కనీస మద్దతు ధర అందిస్తోందన్నారు.పంజాబ్ తర్వాత అత్యధికంగా తెలంగాణ రాష్ట్రం నుండే కేంద్రం బియ్యాన్ని సేకరిస్తోందని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

also read:'వరి' అస్త్రం: కేంద్రంపై యుద్ధానికి కేసీఆర్ 'సై '

దొడ్డు బియ్యం ఎక్కువగా ఎవరూ తినరు, రైతులు కూడా దొడ్డు బియ్యాన్ని ఎక్కువగా పండించరని మంత్రి చెప్పారు. సాధ్యమైనంత వరకు బాయిల్డ్ రైస్ ను తగ్గించాలని కోరామన్నారు. భవిష్యత్తులో ఎఫ్‌సీఐకి దొడ్డు బియ్యం పంపించదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ నేతలు ఇదే రకమైన తప్పుడు ప్రచారం చేశారని మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. బీజేపీని భయపెట్టే ప్రయత్నాలను కేసీఆర్ చేస్తున్నారని మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.  కేసీఆర్ భయపెట్టినంత మాత్రాన బీజేపీ కానీ, కేంద్రం కానీ భయపడదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తేల్చిచెప్పారు.

ధాన్యం కొనుగోలు కోసం తొలుత 40 లక్షల మెట్రిక్ టన్నులకు  రాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ కుదిరిందన్నారు.  ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్రానికి 108 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తోందని ఈ ఏడాది సెప్టెంబర్ 29న లేఖ వచ్చిందని మంత్రి వివరించారు.  రాష్ట్రంలో  90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తోందని సీఎం కేసీఆర్ లేఖ రాశాడని మంత్రి కిషన్ రెడ్డి మూడు లేఖలను మీడియాకు చూపారు. ధాన్యం మార్కెట్లోకి వచ్చిన సమయంలో  కొనుగోలు చేయాలని కేంద్రంపై  రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు.  ప్రతి ఏటా కేంద్రమే ధాన్యాన్ని కొనుగోలు చేసిందని మంత్రి వివరించారు. రూ.3404 కోట్ల నుండి రూ 26వేల 440 కోట్ల వరి ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ఖర్చు పెట్టిందని మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.

బాయిల్డ్ రైస్ కాకుండా రా రైస్ ను దశల వారీగా కొనుగోలు చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఐకేపీ సెంటర్ల వద్ద ధాన్యం కొనుగోలు చేయమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలో ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తే అప్పుడు తిరిగి ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలుకు అంగీకరించారన్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదలను అనుసరించి పెట్రో ధరలు పెరుగుతాయని కిషన్ రెడ్డి చెప్పారు.కరోనా సమయంలో  పేదలకు ఏడాదిన్నర పాటు బియ్యం సరఫరా చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అంతేకాదు ఆరోగ్య రంగంలో మౌళిక వసతుల కల్పనకు ఖర్చు చేశామన్నారు. కరోనా నుండి దేశం బయటపడుతున్న సమయంలో జీఎస్టీ  వసూళ్లలో మెరుగుదల కన్పించిన నేపథ్యంలో పెట్రోల్, డీజీల్ లపై ఉన్న సుంకాన్ని తగ్గించామన్నారు.  ఇదే విషయమై  రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజీల్ పై సుంకాన్ని తగ్గించాలని కోరినట్టుగా కిషన్ రెడ్డి తెలిపారు. 2015 నుండి పెట్రోల్, డీజీల్ పై తెలంగాణ ప్రభుత్వం పన్నులను పెంచిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జీవో ప్రతులను మీడియా సమావేశంలో చూపారు.

మెడికల్ కాలేజీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. మెడికల్ కాలేజీల విషయంలో కేంద్రం పంపిన లేఖకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి సమాచారం రాలేదన్నారు. కేంద్రం పంపిన లేఖ ప్రతిని మంత్రి మీడియా సమావేశంలో చదివి విన్పించారు. ఈ లేఖ గురించి కేసీఆర్ కు తెలుసా అని కిషన్ రెడ్డి అడిగారు. బీబీనగర్ ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో స్థలం కూడా ఇవ్వలేదన్నారు మంత్రి. 

 


 

Follow Us:
Download App:
  • android
  • ios