కవితకు ఈడీ నోటీసులు, చంద్రబాబు అరెస్ట్.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు , ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌లపై స్పందించారు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులపై స్పందించారు కేంద్ర మంత్రి , బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కవితకు నోటీసులు ఇచ్చిన విషయం తనకు తెలియదన్నారు. తెలంగాణలో తమకు ఏ పార్టీతోనూ పొత్తులు లేవని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో వుందని.. తెలంగాణలో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ఆయన వెల్లడించారు. జమిలి ఎన్నికలంటూ బీజేపీ రాజకీయం చేస్తోందని.. బీజేపీ ఇంకా అభ్యర్ధుల జాబితా ప్రకటించలేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ సభను తాము అడ్డుకుంటున్నామన్న వార్తల్లో నిజం లేదని ఆయన వెల్లడించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇక చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పైనా కిషన్ రెడ్డి స్పందించారు. ఆయనను అరెస్ట్ చేసిన విధానం సరైనది కాదన్నారు. తొలుత నోటీసులు ఇచ్చి పిలిచి ప్రశ్నించాలని.. ఆ తర్వాతే అరెస్ట్‌పై నిర్ణయం తీసుకోవాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసే సమయంలోనూ దర్యాప్తు సంస్థలు ఇదే విధంగా వ్యవహరించాయని ఆయన వెల్లడించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు సరికాదని కిషన్ రెడ్డి హితవు పలికారు.
Also Read: తప్పును తప్పు అంటే చంద్రబాబు ఏజెంట్ అంటారు..: వైసీపీపై బండి సంజయ్ సంచలనం
అంతకుముందు చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. కరీంనగర్‌లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబును ఈ విధంగా అరెస్ట్ చేయడాన్ని ప్రతి ఒక్కరు తప్పని అంటున్నారని తెలిపారు. చంద్రబాబును కక్షపూరితంగా అరెస్ట్ చేశారనేది స్పష్టంగా కనబడుతుందని చెప్పారు. తప్పు చేస్తే అరెస్ట్ చేయడాన్ని ఎవరూ కాదనరని తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేని వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారనేది అర్థం కావడం లేదని చెప్పారు. రాజకీయంగా కక్షలు ఉంటే రాజకీయంగా కొట్లాడాలని అన్నారు.
గతంలో ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని అంత ఆదరాబాదరాగా అరెస్ట్ చేయాల్సిన పని లేదని చెప్పారు. ఈ పరిణామాలతో వైసీపీ వాళ్లు తవ్విన గోతిలో వాళ్లే పడుతున్నారని విమర్శించారు. ఏపీ ప్రజల్లో చంద్రబాబుకు మైలేజ్ వచ్చిందని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమంటూ ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందని అన్నారు. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు కూడా స్పందిస్తున్నారని అన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా పలు పార్టీలు కూడా జరిగిన అన్యాయంపై స్పందిస్తున్నారని చెప్పారు.