తప్పును తప్పు అంటే చంద్రబాబు ఏజెంట్ అంటారు..: వైసీపీపై బండి సంజయ్ సంచలనం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. చంద్రబాబును కక్షపూరితంగా అరెస్ట్ చేశారనేది స్పష్టంగా కనబడుతుందని చెప్పారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. కరీంనగర్‌లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబును ఈ విధంగా అరెస్ట్ చేయడాన్ని ప్రతి ఒక్కరు తప్పని అంటున్నారని తెలిపారు. చంద్రబాబును కక్షపూరితంగా అరెస్ట్ చేశారనేది స్పష్టంగా కనబడుతుందని చెప్పారు. తప్పు చేస్తే అరెస్ట్ చేయడాన్ని ఎవరూ కాదనరని తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేని వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారనేది అర్థం కావడం లేదని చెప్పారు. రాజకీయంగా కక్షలు ఉంటే రాజకీయంగా కొట్లాడాలని అన్నారు.
గతంలో ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని అంత ఆదరాబాదరాగా అరెస్ట్ చేయాల్సిన పని లేదని చెప్పారు. ఈ పరిణామాలతో వైసీపీ వాళ్లు తవ్విన గోతిలో వాళ్లే పడుతున్నారని విమర్శించారు. ఏపీ ప్రజల్లో చంద్రబాబుకు మైలేజ్ వచ్చిందని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమంటూ ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందని అన్నారు. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు కూడా స్పందిస్తున్నారని అన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా పలు పార్టీలు కూడా జరిగిన అన్యాయంపై స్పందిస్తున్నారని చెప్పారు.
వైసీపీ నేతల్లో ఓ దరిద్రపు అలవాటు ఉందని.. ఏపీ ఏదైనా తప్పును తప్పు అంటే చంద్రబాబు ఏజెంట్ అంటారని విమర్శించారు. పవన్ కల్యాణ్ ఏజెంట్ అంటారని మండిపడ్డారు. వాళ్లు మాత్రమే సుద్దపూసలు అయినట్టుగా మాట్లాడతారని విమర్శించారు. ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకుంటే వారికే మైలేజ్ వస్తుందని అన్నారు. అలా కాకుండా కక్షపూరితంగా జైలు నుంచి బయటకు రానీయమంటే.. ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పారు.