మాదాపూర్, హైటెక్ సిటీలనే కాదు.. బస్తీలనూ పట్టించుకోండి : తెలంగాణ సర్కార్‌పై కిషన్ రెడ్డి ఆగ్రహం
హైటెక్ సిటీ, మాదాపూర్‌లకే ప్రభుత్వ పెద్దలు డబ్బులు ఖర్చు చేస్తున్నారని.. బస్తీలను పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. అభివృద్ధి అంటే ఫ్లై ఓవర్లు కాదని.. బస్తీలను కూడా బాగు చేయాలని తెలంగాణ సర్కార్‌కు చురకలంటించారు

అభివృద్ధి అంటే ఫ్లై ఓవర్లు కాదని.. బస్తీలను కూడా బాగు చేయాలని తెలంగాణ సర్కార్‌కు చురకలంటించారు కేంద్ర మంత్రి , రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. హైదరాబాద్‌లో భారీ వర్షాలు, వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలను శుక్రవారం ఆయన పరామర్శించారు. యూసుఫ్‌గూడలో నాలాలు, రోడ్ల పరిస్ధితిని పరిశీలించిన కిషన్ రెడ్డి.. తక్షణం ఇక్కడి సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు.
అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో డ్రైనేజ్ సిస్టమ్ పూర్తిగా దెబ్బతిందన్నారు. పూడిక తీయకపోవంతో రోడ్లపై మురుగు నీరు పారుతోందని.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీవరేజ్ బోర్డుకు నిధులు లేవని, కాంట్రాక్టర్లకు సైతం బిల్లులు క్లియర్ చేయడం లేదని ఆయన దుయ్యబట్టారు. హైటెక్ సిటీ, మాదాపూర్‌లకే ప్రభుత్వ పెద్దలు డబ్బులు ఖర్చు చేస్తున్నారని.. బస్తీలను పట్టించుకోవడం లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు.
Also Read: రైతులు, నిరుద్యోగులు, మహిళలను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసింది.. : కిషన్ రెడ్డి ఫైర్
అంతకుముందు ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారీ వర్షాలతో అతలాకుతలమైన ప్రజలను ఆదుకునేందుకు బీజేపీ రాష్ట్ర శాఖ కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించనున్నట్లు తెలిపారు. వివరాల్లోకెళ్తే.. భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల గోడును సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జీ.కిషన్ రెడ్డి ఆరోపించారు.
అధికారులు అప్రమత్తంగా ఉన్నా కేసీఆర్ మాత్రం అప్రమత్తం కావడం లేదన్నారు. ఫామ్ హౌస్, ప్రగతి భవన్ (తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం)లో కేసీఆర్ ఉన్నారు. భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల గోడు వినడం లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. భారీ వర్షాలతో నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు బీజేపీ రాష్ట్ర శాఖ కేంద్ర ప్రభుత్వం సాయం కోరుతుందని తెలిపారు.
ALso Read: వరదలను చూసి మంత్రులు చేతులెత్తేశారు: కేసీఆర్ సర్కార్ పై డీకే అరుణ
ఈ రోజు కేంద్ర హోంశాఖ కార్యదర్శితో పాటు కొందరు కలెక్టర్లతోనూ మాట్లాడాను. రాష్ట్రంలో వర్షాలతో నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం తీసుకోవాలని నిర్ణయించాం. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి, విపత్తుల నిర్వహణ ఇన్చార్జిలతో కూడా మాట్లాడానని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్ బీవై)ను అమలు చేయకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆరోపించారు.
రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమలు చేయాలన్నారు. భారీ వర్షాలు, తుఫాను తదితర విపత్తుల సమయంలో రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందన్నారు. తెలంగాణ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాలు పంటల బీమా పథకాన్ని అమలు చేశాయని కిషన్ రెడ్డి తెలిపారు.