తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖలకు జవాబిచ్చే సంస్కారం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశ ఆర్ధిక వ్యవస్థపై చర్చకు తాను సిద్ధమనేని కేసీఆర్‌కు కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. మోడీని విమర్శించండి కానీ, రాష్ట్రానికి వస్తున్న ప్రాజెక్ట్‌లను అడ్డుకోవద్దని కిషన్ రెడ్డి హితవు పలికారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వివిధ ప్రాజెక్ట్‌లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో తాము చర్చలు జరుపుతున్నామన్నారు. ముఖ్యమంత్రికి పలుమార్లు తాను ఉత్తరాలు రాస్తున్నానని.. అయితే ఏ ఒక్క దానికి కేసీఆర్ నుంచి జవాబు రాలేదని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణకు మోడీ, కిషన్ రెడ్డిలు ఏం చేశారని కేసీఆర్, కేటీఆర్‌లు అడుగున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కేంద్ర మంత్రులకు ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చే లేఖలను ప్రాసెస్ చేసేందుకు ఒక వ్యవస్థ వుంటుందని కిషన్ రెడ్డి వెల్లదించారు. కానీ కేసీఆర్‌కు జవాబు ఇచ్చే సంస్కారం లేదు కాబట్టి కేంద్రాన్ని ప్రశ్నించే హక్కు లేదని కేంద్ర మంత్రి తేల్చేశారు. ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు నిమిత్తం భూమి ఇవ్వాలని కేంద్రం ఎన్నిసార్లు అడిగినా, ఇప్పటి వరకు ఇవ్వలేదని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కానీ తమ వంతుగా ఇప్పటి వరకు రూ.1 కోటి ఇచ్చామని కేంద్ర మంత్రి తెలిపారు.
ఇక దేశ ఆర్ధిక వ్యవస్థపై చర్చకు తాను సిద్ధమనేని కేసీఆర్‌కు కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. అసెంబ్లీలో దేశం గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి.. రాష్ట్ర గురించి ఎందుకు మాట్లాడలేదని కేంద్ర మంత్రి నిలదీశారు. మోడీని ద్వేషించడమే పనిగా అసెంబ్లీని వాడుకున్నారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. మరికొన్ని నెలలో కేసీఆర్ గద్దె దిగుతారని.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజ్‌భవన్‌లో రాజీనామా లేఖ ఇవ్వకతప్పదని ఆయన సవాల్ విసిరారు. మోడీని విమర్శించండి కానీ, రాష్ట్రానికి వస్తున్న ప్రాజెక్ట్‌లను అడ్డుకోవద్దని కిషన్ రెడ్డి హితవు పలికారు. మెడికల్ కాలేజీలకు దరఖాస్తు పెట్టుకోవాలని తాము చెప్పినప్పుడు పట్టించుకోలేదని.. ఇప్పుడేమో కాలేజీలు ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, కుటుంబ పాలనపై ప్రజలు ఆలోచించుకోవాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
Also REad: వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే: సీఐఐ సదస్సులో కేటీఆర్
అంతకుముందు ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో మళ్లీ తమ పార్టీ అధికారంలోకి వస్తుందని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు హైద్రాబాద్ లో జరిగిన సీఐఐ వార్షిక సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. మీ ఉత్సాహం చూస్తుంటే అధికారం మాదేననే విషయం స్పష్టంగా అర్ధమైందన్నారు. గత ఎన్నికలకు ముందు కూడా సీఐఐ సదస్సుకు వచ్చిన విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. విభిన్న కంపెనీలు మాత్రమే కాదు విభిన్నమైన ఆచారాలు, ఆహారం కూడా హైద్రాబాద్ లో కన్పిస్తాయన్నారు మంత్రి కేటీఆర్.
ఎలక్ట్రిక్ వాహన రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని ఆయన చెప్పారు. ముందు చూపుతో ఈవీ బ్యాటరీ తయారీ రంగంలో పరిశ్రమలను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. భారత్ లో పెరుగుతున్న యువ జనాభా ఎంతో అనుకూలం కానుందని మంత్రి అభిప్రాయపడ్డారు. వ్యాపారులు , పెట్టుబడులకు రాష్ట్రంలో అద్భుతమైన వాతావరణం ఉందన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయన్నారు. 2013తో పోలిస్తే రాష్ట్రంలో పెట్టుబడులు మరింత రెట్టింపు అయిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.
