మునుగోడు ఉపఎన్నికలో భాగంగా చండూరులో ఆదివారం జరిగిన సభలో బీజేపీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి కిషన్ రెడ్డి. 32 మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ లాక్కున్నారని.. ఈ తొమ్మిదేళ్లలో మునుగోడుకు నీళ్లు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు
మునుగోడు ఉపఎన్నికలో భాగంగా చండూరులో ఆదివారం జరిగిన సభలో బీజేపీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి కిషన్ రెడ్డి. అభద్రతా భావం, అపనమ్మకం కేసీఆర్‌లో కనిపించిందన్నారు. పరోక్షంగా కేసీఆర్ ఓటమిని అంగీకరించారని.. పాత రికార్డునే చండూరు సభలో ప్లే చేశారని ఆయన దుయ్యబట్టారు. ఆరోపణలు, హామీలపై కేసీఆర్ అవాస్తవాలు చెప్పారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. వేరే పార్టీ గుర్తుపై గెలిచినవారిని మీ పార్టీలో చేర్చుకున్నారని.. ఎఫ్ఐఆర్‌లో డబ్బు విషయం ఎందుకు పొందుపర్చలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఫిరాయింపులకు కేసీఆర్ కుటుంబం కేరాఫ్ అడ్రస్ అని ఆయన దుయ్యబట్టారు.
టీఆర్ఎస్‌కు ఎందుకు మద్ధతిస్తున్నారో వామపక్షాలు పరిశీలించుకోవాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. నలుగురు హీరోలని కేసీఆర్ చెబుతున్న నేతలు పార్టీ ఫిరాయించినవారేనని ఆయన అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని.. 40 లక్షల టర్నోవర్ వరకూ ఏ రకమైన జీఎస్టీ లేదని కిషన్ రెడ్డి తెలిపారు. జీఎస్టీ టారిఫ్ నిర్ణయించింది కేంద్రం కాదని.. జీఎస్టీ కౌన్సిల్ అని ఆయన అన్నారు. చేనేత కార్మికులపై ప్రేమ వుంటే జీఎస్టీ కౌన్సిల్‌లో ఎందుకు వ్యతిరేకించలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. వాజ్‌పేయి తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్లోరైడ్ సమస్యను పూర్తిగా పక్కనపెట్టిందన్నారు.
ALso REad:ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకున్నారు:చండూరులో బీజేపీపై కేసీఆర్ ఫైర్
కానీ మోడీ ప్రభుత్వం ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి 800 కోట్లు ఖర్చు చేసిందని.. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కేసీఆర్ అప్పుడెందుకు మాట్లాడలేదని కిషన్ రెడ్డి నిలదీశారు. 32 మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ లాక్కున్నారని.. ఈ తొమ్మిదేళ్లలో మునుగోడుకు నీళ్లు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. ఇదే మునుగోడు ఎన్నికల సభలో గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మీ దగ్గర అంత పెద్ద సినిమా వుంటే న్యాయస్థానానికి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. మీరు చేసే కుంభకోణాలు కప్పిపుచ్చుకోవడానికే సీబీఐని అడ్డుకుంటున్నారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈడీ, ఐటీ, సీబీఐ అంటే ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని కేంద్ర మంత్రి ప్రశ్నించారు.
