ఆ డబ్బు లెక్కించే యంత్రాలు హీటెక్కిపోతున్నాయి .. ధీరజ్ సాహూ ఇంట్లో ఐటీ దాడులపై కిషన్ రెడ్డి
ఇటీవల జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఇళ్లు, కార్యాలయాల్లో జరిగిన ఐటీ దాడుల్లో రూ.290 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా కలకలరం రేపింది. ఆ డబ్బును లెక్కించే యంత్రాలు వేడెక్కి మొరాయిస్తున్నాయే కానీ.. లెక్కించడం మాత్రం పూర్తికావడం లేదని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ఇటీవల జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఇళ్లు, కార్యాలయాల్లో జరిగిన ఐటీ దాడుల్లో రూ.290 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా కలకలరం రేపింది. దీనిపై ప్రధాని మోడీ సైతం ఘాటుగా స్పందించారు. ప్రజల నుంచి దోచుకున్న ప్రతి పైసా ఇప్పిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. దేశ చరిత్రలో ఐటీ దాడుల్లో ఇంత మొత్తం బయటపడటం ఇదే తొలిసారని అన్నారు.
ఈ ఖ్యాతి కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆ డబ్బును లెక్కించే యంత్రాలు వేడెక్కి మొరాయిస్తున్నాయే కానీ.. లెక్కించడం మాత్రం పూర్తికావడం లేదని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీలో అవినీతి ఏ రకంగా వుందో దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చన్నారు. రాహుల్ గాంధీకి ధీరజ్ సాహూ అత్యంత నమ్మకస్తుడైన అనుచరుడని, భారత్ జోడో యాత్రకు అన్ని ఏర్పాట్లు చేసింది ఆయనే అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఐటీ దాడులపై రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు.
ధీరజ్ సాహు వంటి అవినీతిపరులు ఇంకా ఎంతమంది రాహుల్ గాంధీతో సన్నిహితంగా వుంటున్నారో.. ఆ డబ్బు ఎవరిదో ఆయనే చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. యూపీఏ హయాంలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని.. 2జీ, బొగ్గు వంటి అనేక కుంభకోణాలు జరిగాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలో వున్న చోట మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్లుగా అవినీతి వుందని కిషన్ రెడ్డి చురకలంటించారు. కాంగ్రెస్ పార్టీకి, అవినీతికి విడదీయలేని బంధం వుందని ఆయన పేర్కొన్నారు.
కాగా.. ధీరజ్ సాహు ఘటన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ప్రజలు ముందు కుప్పలు తెప్పలుగా కరెన్సీ నోట్లను చూడాలని, ఆ తర్వాత ప్రతిపక్ష నేతల ప్రసంగాలు వినాలంటూ చురకలంటించారు. దేశప్రజలు ఈ నోట్ల కుప్పను చూసి ఆ తర్వాత తమ నాయకుల నిజాయితీతో కూడిన ప్రసంగాలు వినాలి.. ప్రజల నుంచి దోచుకున్న ప్రతి పైసా తిరిగి ఇవ్వాల్సిందే, ఇదే మోదీ హామీ’’ అంటూ ప్రధాని వ్యాఖ్యానించారు.