తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికే లేదు: ఆదిలాబాద్ సభలో కిషన్ రెడ్డి
దేశంలో మోడీ సర్కార్ సమర్ధవంతమైన పాలన అందిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.
ఆదిలాబాద్: త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని 17 ఎంపీ స్థానాల్లో గెలిపించాలని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రజలను కోరారు. సోమవారం నాడు ఆదిలాబాద్ లో నిర్వహించిన బీజేపీ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించడానికి ముందు ఆయన స్థానిక పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడారు.
also read:పెద్దన్నలా మోడీ సహకరించాలి: ఆదిలాబాద్ సభలో రేవంత్ రెడ్డి
ప్రపంచ చిత్రపటంలో భారత్ ను అత్యున్నత స్థాయిలో నిలిపేలా నరేంద్ర మోడీ పాలన అందిస్తున్నారన్నారు.నీతివంతమైన, సమర్థవంతమైన, సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం గురించి కిషన్ రెడ్డి నొక్కి చెప్పారు.పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం మోడీ పనిచేస్తున్నారన్నారు.
మోడీ మూడోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడేలా దేశ ప్రజల ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చారని కిషన్ రెడ్డి చెప్పారు. గతంలో కూడా ఆదిలాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిని ఎంపీగా గెలిపించిన విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. మోడీని మూడోసారి ప్రధానమంత్రిగా ఆశీర్వదించాలని కోరారు కిషన్ రెడ్డి.
also read:ఆదిలాబాద్‌లో మోడీ టూర్: రూ. 56 వేల కోట్లతో పలు పనులను ప్రారంభించిన ప్రధాని
హైదరాబాద్ లో ఎంఐఎం సీటును సైతం బీజేపీ కైవసం చేసుకునేలా ఆశీర్వదించాలని కిషన్ రెడ్డి కోరారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేదని ఆయన ఎద్దేవా చేశారు. అవినీతి, అహంకార, నియంతృత్వ పాలనను కేసీఆర్ పాలనలో చూసినట్టుగా కిషన్ రెడ్డి విమర్శించారు.
also read:అవినీతి కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు వినహాయింపు లేదు: సుప్రీం సంచలన తీర్పు
అనేక రకాల హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఆ హామీలను అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి రోడ్ మ్యాప్ లేదని ఆయన ఆరోపించారు.ఓటుబ్యాంకు రాజకీయాలే తప్ప కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏ రకమైన ఎజెండా లేదని కిషన్ రెడ్డి విమర్శించారు.
రైతులకు రైతుబంధు పెంచుతామని హామీ ఇచ్చారు, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, మహిళలకు రూ. 2,500 చొప్పున నగదు ఇస్తామన్న హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయలేదని ఆయన మండిపడ్డారు.