Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు: లోక్‌సభలో కేంద్ర మంత్రి అర్జున్ ముండా కీలక వ్యాఖ్యలు

గిరిజనులకు రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంకోర్టులో  కేసుల పరిష్కారం తర్వాతే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి అర్జున్ ముండా చెప్పారు. ఈ విషయమై చేవేళ్ల ఎంపీ  డాక్టర్ రంజిత్ రెడ్డి  వేసిన ప్రశ్నకు గాను కేంద్రమంత్రి అర్జున్ ముండా స్పందించారు. 

Union Minister  Arjun Munda Reacts  on hike Tribal reservations in Telangana
Author
First Published Dec 12, 2022, 2:37 PM IST

న్యూఢిల్లీ:  సుప్రీంకోర్టులో కేసుల పరిష్కారం తర్వాతే తెలంగాణలో గిరిజనులకు రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని  కేంద్ర మంత్రి అర్జున్ ముండా ప్రకటించారు.సోమవారం నాడు లోక్ సభలో  గిరిజన రిజర్వేషన్ల అంశంపై  చర్చ జరిగింది. టీఆర్ఎస్ కు చెందిన చేవేళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి  తెలంగాణ రాష్ట్రంలో   గిరిజనులకు  రిజర్వేషన్లను 6 నుండి 10 శాతానికి పెంచిన అంశాన్ని ప్రస్తావించారు.ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం ఆమోదిస్తూ పంపిన  తీర్మానం కేంద్రానికి అందిందని  కేంద్ర మంత్రి అర్జున్ ముండా లోక్ సభకు చెప్పారు. సుప్రీంకోర్టులో  కేసుల పరిష్కారం తర్వాతే గిరిజన రిజర్వేషన్లపై ముందుకు  వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మంత్రి అర్జున్ ముండా వివరించారు.

ఈ ఏడాది అక్టోబర్  1వ తేదీన  తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు  10 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ  33 నెంబర్ జీవోను జారీ చేసింది. అంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో  ఆరు శాతం మాత్రమే  గిరిజనులకు రిజర్వేషన్లు ఉండేవి. జనాభా దామాషా ప్రకారంగా  గిరిజనులకు  రిజర్వేషన్లను  ఆరు శాతం నుండి 10 శాతానికి పెంచాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు 33 జీవోను జారీ చేశారు.

విద్య, ఉద్యోగ రంగాల్లో  గిరిజనులకు  పది శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ ఈ జీవోను జారీ చేసింది కేసీఆర్ సర్కార్. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ నేతృత్వంలోని సర్కార్  గిరిజనులకు రిజర్వేషన్ల పెంపుపై  అధ్యయనం చేసింది.  ఈ విషయమై కేసీఆర్ సర్కార్  నియమించిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఎస్. చెల్లప్ప  నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీ రాష్ట్రంలో పర్యటించింది.గిరిజనులకు రిజర్వేషన్లను పెంచాలని ఈ కమిటీ 2015 లో సిఫారసు చేసింది. ఈ విషయమై కేసీఆర్ సర్కార్  ఈ ఏడాది  అక్టోబర్  1వ తేదీన  గిరిజనులకు  రిజర్వేషన్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios