గన్నవరంలో అమిత్ షాకు ఘన స్వాగతం: ఖమ్మం బయలుదేరిన కేంద్ర మంత్రి
కేంద్ర మంత్రి అమిత్ షా ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. ఖమ్మంలో నిర్వహించే బీజేపీ సభలో పాల్గొనేందుకు గన్నవరం నుండి ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో ఖమ్మం పట్టణానికి బయలు దేరారు.
గన్నవరం: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం నాడు మధ్యాహ్నం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుండి నేరుగా ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో ఖమ్మం పట్టణానికి బయలుదేరారు.
ఖమ్మం పట్టణంలో ఇవాళ బీజేపీ ఆధ్వర్వంలో నిర్వహిస్తున్న రైతు గోస-బీజేపీ భరోసా సభలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొంటారు. గన్నవరంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఏపీ రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత, పలువురు బీజేపీ నేతలు అమిత్ షా కు ఘనంగా స్వాగతం పలికారు.
ఖమ్మంలో బీజేపీ నిర్వహించే సభ తర్వాత బీజేపీకి చెందిన తెలంగాణ నేతలతో సమావేశం కానున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహంపై అమిత్ షా పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు.
మరో వైపు ఈ నెలాఖరు నుండి తెలంగాణలో బీజేపీ నేతలు బస్సు యాత్రలు చేయాలని భావిస్తున్నారు.ఈ బస్సు యాత్రలను ముగింపును వచ్చే నెల 17వ తేదీతో ముగించాలని ప్లాన్ చేస్తున్నారు. బస్సు యాత్ర ముగింపును పురస్కరించుకొని నిర్వహించే సభకు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించాలని బీజేపీ నేతలు తలపెట్టారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ నాయకత్వం ప్లాన్ చేస్తుంది. ఈ దిశగా ఇవాళ పార్టీ నేతలకు అమిత్ షా దిశా నిర్దేశం చేయనున్నారు. దక్షిణాదిపై బీజేపీ నాయకత్వం కేంద్రీకరించింది.తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ నాయకత్వం చర్యలను చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం గత కొంత కాలంగా బీజేపీ కేంద్ర నాయకత్వం వ్యూహత్మకంగా అడుగులు వేస్తుంది. సునీల్ భన్సల్ నేతృత్వంలో ఓ టీమ్ ఇప్పటికే రంగంలోకి దిగింది.
పలు రాష్ట్రాలకు చెందిన బీజేపీ ప్రజా ప్రతినిధులు తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వారం రోజుల పాటు పర్యటించి పార్టీ కేంద్ర నాయకత్వానికి నివేదికను ఇవ్వనున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి నాలుగు పార్లమెంట్ స్థానాలు దక్కాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడ ఆ పార్టీ 48 కార్పోరేట్ స్థానాలను దక్కించుకుంది.