Amit Shah: అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు.. కారణమదేనా?
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి ప్రకటనను విడుదల చేశారు. అసలు కారణమేంటీ?
Amit Shah: ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన అధికారాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలు అటూ బీఆర్ఎస్ కే కాదు..బీజేపీకి కూడా షాకిచ్చాయి. బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో పాటు పార్టీకి మూల స్థంభాల ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఓటమి పాలయ్యారు. ఈ పరిణామం పార్టీ క్యాడర్ లో నిరాశ, అభద్రత భావం నెలకొనిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో నిరాశలో ఉన్న బీజేపీ శ్రేణులలో జోష్ పెంచాలని బీజేపీ అగ్రనాయకత్వం భావించింది.
గత అసెంబ్లీ ఎన్నికల ఓటమిని దృష్టిలో పెట్టుకున్న బీజేపీ అధిష్టానం.. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికలకు సమర శంఖాన్ని పూరించాలని భావించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా పార్టీ శ్రేణులలో జోష్ పెంచాలని బీజేపీ అగ్రనాయకత్వం భావించింది. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు తెలంగాణలో పర్యటించాలని షెడ్యూల్ ఫిక్స్ చేశారు. కానీ అనివార్య కారణాల వల్ల కేంద్ర మంత్రి పర్యటన రద్దయింది. అయితే బీహార్ లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు చేయబడిందని భారతీయ జనతా పార్టీ వర్గాలు తెలిపాయి.
వాస్తవానికి లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో భాగంగా నేడు రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, కరీంనగర్, హైదరాబాద్‌లలో పార్టీ కార్యకర్తలతో క్లస్టర్ సమావేశాలు నిర్వహించి, లోక్‌సభ ఎన్నికల వ్యూహంపై చర్చించడానికి ఒకే రోజు పర్యటనను షెడ్యూల్ చేశారు. కానీ.. ప్రస్తుతం బీహార్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభం నెలకొంది. బీహార్లో నితీష్ కుమార్ ఇండియా కూటమికి గుడ్ బై చెప్పి.. తన మాజీ మిత్ర పార్టీ బిజెపి వైపు దృష్టి పెట్టినట్టు ప్రచారం జరుగుతుంది.
ఏది ఏమైనప్పటికీ..అందరి దృష్టి ఇప్పుడు బీహార్ ముఖ్యమంత్రి, JD(U) అధ్యక్షుడు నితీష్ కుమార్ రాజకీయ చాణక్యంపైనే ఉన్నాయి. గత మూడు సంవత్సరాలలోపు బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరగడంతో అమిత్ షా దానిపై ఎక్కువ శ్రద్ధ చూపే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం.. ఆదివారం బీహార్‌లో నితీష్ కుమార్ తొమ్మిదోసారి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఆయన జనవరి 27, శనివారం గవర్నర్ నివాసానికి వెళ్లి ఎమ్మెల్యేల జాబితాను అందజేస్తారని, ఆ తర్వాత రాజీనామా చేస్తారని తెలుస్తోంది.