తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తాము అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తానని ఆయన స్పష్టం చేశారు. 

తెలంగాణలో త్వరలోనే ప్రభుత్వం మారబోతోందని.. బీజేపీ అధికారంలోకి వచ్చాక విమోచన దినోత్సవాన్ని (telangana vimochana dinotsavam) అధికారికంగా నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (amit shah) స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆనాడు పోలీస్ యాక్షన్ లేకపోతే తెలంగాణ లేదని.. నిజాం నుంచి తెలంగాణకు విముక్తి కల్పించింది సర్దార్ వల్లభభాయ్ పటేలేనని (vallabhbhai patel) అమిత్ షా తెలిపారు. 

హైదరాబాద్ దినోత్సవాన్ని నిర్వహించకపోవడం బాధ కలిగిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తెలంగాణపై ఎలాంటి వివక్షా లేదని.. తెలంగాణపై ఎప్పుడూ సవతి ప్రేమ చూపించలేదని అమిత్ షా స్పష్టం చేశారు. ఏ ముఖ్యమంత్రి ఢిల్లీ వచ్చినా గౌరవిస్తామని.. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశం పురోగమిస్తుందని తాము నమ్ముతామని ఆయన తెలిపారు. రాష్ట్రాలతో తాము సత్సంబంధాలు కొనసాగిస్తున్నామని అమిత్ షా వెల్లడించారు. 

Also Read:చార్మినార్‌పై అలా అనలేదు, భాగ్యలక్ష్మి టెంపుల్ పై చేయి వేస్తే ఊరుకోం: బండి సంజయ్ ఫైర్

2004 నుంచి 2014 వరకు తెలంగాణ డిమాండ్‌ను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. 2014 ఎన్నికల కోసమే హడావుడిగా తెలంగాణను ప్రకటించారని ఆరోపించారు. వాజ్‌పేయ్ హయాంలో మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయని.. ఆ రాష్ట్రాల్లో విభేదాలే లేవని అమిత్ షా గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటు కోసం ఎన్నో ఏళ్లుగా ఉద్యమం జరిగిందని తెలిపారు. అన్ని రాష్ట్రాల అభివృద్ధికి మోడీ సర్కార్ కట్టుబడి వుందని అమిత్ షా తెలిపారు.