దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో బూస్టర్ డోస్ వేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఇంటింటికీ టీకా కార్యక్రమంలో భాగంగా 1.30 లక్షల మందికి టీకా అందించామని ఆయన వివరించారు.
కొన్ని నెలలుగా నెమ్మదించిన కరోనా వైరస్ (coronavirus) ఇటీవల మళ్లీ దేశంలో విజృంభిస్తోంది . ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ సహా పలు నగరాలు, పట్టణాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. వైరస్ విస్తరణపై దృష్టి సారించాలని రాష్ట్రాలకు సూచించింది. దీనిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం (telangana govt) సైతం అలర్ట్ అయ్యింది. ఈ క్రమంలో ప్రభుత్వ టీకా కేంద్రాల్లో 18 ఏళ్లు పైబడిన వారికి కొవిడ్ బూస్టర్ డోస్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (harish rao) కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
నిక్షయ్ మిత్ర క్యాంపెయిన్, రాష్ట్రీయ నేత్ర జ్యోతి అభియాన్, హర్ ఘర్ దస్తక్ క్యాంపెయిన్-2.0పై కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ (mansukh mandaviya) సోమవారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వైద్యారోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు.. రాష్ట్రంలో జరుగుతున్న టీబీ నిర్మూలన, కంటి పరీక్షలు, కరోనా వాక్సినేషన్ కార్యక్రమాల గురించి కేంద్ర మంత్రికి వివరించారు.
ALso Read:Corona: ఐదారు నెలలకు ఒక కొత్త వేవ్.. బూస్టర్ డోసు వేసుకోవాలి: డబ్ల్యూహెచ్‌వో టాప్ సైంటిస్టు
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద 32 లక్షల కొవిడ్ టీకా డోసులున్నాయని .. వాటి ముగింపు తేదీ దగ్గర్లోనే ఉందని హరీశ్ వరావు వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయని.. ఈ నేపథ్యంలో ప్రభుత్వ టీకా కేంద్రాల్లో బూస్టర్ డోస్ ఇచ్చేందుకు అనుమతించాలని మంత్రి కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఇంటింటికీ టీకా కార్యక్రమంలో భాగంగా 1.30 లక్షల మందికి టీకా అందించామని హరీశ్ వివరించారు. 12 ఏళ్లు పైబడిన వారికి.. మొదటి డోసు 104.78 శాతం, రెండో డోసు 99.72 శాతం పంపిణీ చేశాం అని మంత్రి వెల్లడించారు.
మరోవైపు.. ప్రతి నాలుగు నుంచి ఆరు నెలలకు ఒక కొత్త కరోనా వేవ్ వచ్చే అవకాశం ఉందని, కాబట్టి, బూస్టర్ షాట్ వేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ (soumya swaminathan) సూచించారు. బలహీనులకు.. అంటే రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారు తప్పకుండా మూడో డోసు వేసుకోవాలని ఆమె వివరించారు. కరిగిపోతున్న రోగ నిరోధక శక్తిని మళ్లీ బలోపేతం చేయడానికి బూసర్ట్ షాట్ చాలా అవసరం అని సౌమ్య స్వామినాథన్ అన్నారు. బలహీనుల్లో అంటే వయోధికులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి చాలా ముఖ్యం అని ఆమె పేర్కొన్నారు. ప్రతి నాలుగు నుంచి ఆరు నెలల్లో ఒక కొత్త వేవ్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. ఆ వేవ్ తీవ్రత అప్పడు రోగ నిరోధక శక్తి బలహీనంగా ఎంత మంది ఉన్నారనే దానిపై ఆధారపడి ఉంటుందని చెప్పారు.
