వై ప్లస్ భద్రత: ఈటల నివాసానికి చేరుకున్న సీఆర్‌పీఎఫ్ జవాన్లు
మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు కేంద్ర ప్రభుత్వం వై ప్లస్ భద్రతను కేటాయించింది. ఇవాళ సాయంత్రం సీఆర్‌పీఎఫ్ జవాన్లు ఈటల నివాసానికి చేరుకున్నారు.
హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు కేంద్ర ప్రభుత్వం వై ప్లస్ భద్రతను కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఈటల రాజేందర్ ఇంటికి సీఆర్‌పీఎఫ్ జవాన్లు వచ్చారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను చంపేందుకు సుఫారీ ఇచ్చారని రాజేందర్ సతీమణి జమున గత మాసంలో ఆరోపించారు. రాజేందర్ ను చంపేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సుఫారీ ఇచ్చారని జమున ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో రాజేందర్ కు కేంద్రప్రభుత్వం వై ప్లస్ భద్రతను కేటాయించింది. ఇవాళ సీఆర్‌పీఎఫ్ జవాన్లు ఈటల నివాసానికి చేరుకున్నారు.
ఈటల రాజేందర్ భద్రతను రాష్ట్ర ప్రభుత్వం కూడ సీరియస్ గా తీసుకుంది. ఈటల రాజేందర్ నివాసాన్ని గత మాసంలో మేడ్చల్ డీసీపీ సందీప్ రావు పరిశీలించారు. ఈటల రాజేందర్ తో భద్రత విషయమై చర్చించారు. సుఫారీ ఆరోపణలపై కూడ డీసీపీ సందీప్ రావు ఈటల రాజేందర్ తో చర్చించారు.
ఈటల రాజేందర్ ను చంపేందుకు సుఫారీ ఇచ్చారని జమున ఆరోపణలు చేయడంతో ఈ విషయమై డీజీపీ రాజేందర్ రెడ్డితో మంత్రి కేటీఆర్ కూడ చర్చించారు. ఈటల రాజేందర్ కు భద్రత విషయాన్ని పరిశీలించాలని ఆదేశించారు. అంతేకాదు ఈటల రాజేందర్ కు పటిష్టమైన భద్రతను కూడ కల్పించాలని ఆదేశించారు. కేటీఆర్ ఆదేశాలతో మేడ్చల్ డీసీపీ ఈటల రాజేందర్ నివాసంలో భద్రతను తనిఖీ చేశారు.
also read:ఈటల, అరవింద్‌లకు భద్రత పెంపు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..
తనను అంతమొందించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సుఫారీ ఇచ్చారని రాజేందర్ కూడ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కొట్టి పారేశారు. హత్యలతో రాజకీయాలు చేసే చరిత్ర ఈటల రాజేందర్ కు ఉందని కౌశిక్ రెడ్డి గతంలోనే ఆరోపణలు చేశారు.
హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి గతంలో ఈటల రాజేందర్ పై కాంగ్రెస్ పార్టీ నుండి కౌశిక్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో ఈటల రాజేందర్ ను కేసీఆర్ తన మంత్రి వర్గం నుండి తొలగించారు. దీంతో ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. బీజేపీలో చేరడానికి ముందు ఎమ్మెల్యే పదవికి కూడ రాజీనామా చేశారు. దీంతో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ విజయం సాధించారు.