తెలంగాణ బీజేపీలో కీలక నేతలుగా ఉన్న ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్‌ల భద్రత విషయం కీలక  నిర్ణయం తీసుకుంది. 

తెలంగాణ బీజేపీలో కీలక నేతలుగా ఉన్న ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్‌ల భద్రత విషయం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్‌లకు అదనపు సెక్యూరిటీ కల్పించడంపై కేంద్ర హోం శాఖ సమాచారం ఇచ్చింది. ఈటల రాజేందర్‌కు ‘వై’ ప్లస్ భద్రతను కేటాయించింది. ఈటల రాజేందర్‌కు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తో పాటు 11 మందితో కూడిన సీఆర్పీఎఫ్ సిబ్బంది ఉండనున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు ‘వై’ కేటగిరి భద్రతను కల్పించనుంది. ఇందులో భాగంగా ధర్మపురి అరవింద్‌కు 8 మందితో కూడిన సీఆర్పీఎఫ్ సిబ్బంది రక్షణ కల్పించనున్నారు. 

ఈ క్రమంలోనే ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ ఇళ్ల వద్ద పరిస్థితిని సీఆర్‌పీఎఫ్ బలగాలు సమీక్షించనున్నాయి. హైదరాబాద్‌తో పాటు.. నియోజకవర్గాల్లోని వారి నివాసాల్లో భద్రతకు సంబంధించి రివ్యూ నిర్వహించనున్నాయి. అనంతరం భద్రతను ఏ విధంగా సమన్వయం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. 

అయితే ధర్మపురి అరవింద్ నివాసంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మద్దతుదారులు దాడి చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇటీవల ఈటల రాజేందర్‌కు ప్రాణహాని ఉందని ఆయన సతీమణి జమున ఆరోపించారు. ఈ ఆరోపణలపై మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. ఈటల భద్రతపై ఆరా తీశారు. ఈ క్రమంలోనే వై ప్లస్‌ క్యాటగిరీ భద్రతను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. అయితే మరోవైపు ఈటల కూడా తన భద్రతకు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించినట్టుగా తెలుస్తోంది.