Asianet News TeluguAsianet News Telugu

కృష్ణా నది జలాలపై కొత్త ట్రిబ్యునల్ : సొలిసిటర్ జనరల్ అభిప్రాయం కోరిన కేంద్రం

కృష్ణా నది జలాలపై  కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు  విషయమై  అభిప్రాయం చెప్పాలని సొలిసిటర్ జనరల్   అభిప్రాయం కోరింది కేంద్రం.  ఇదే విషయమై  అభిప్రాయం తెలిపిందుకే అటార్నీ జనరల్ నిరాకరించారు. 
 

Union Government Asks  opinion  solicitor general  on New Tribunal appointment  of Krishna River
Author
First Published Feb 3, 2023, 3:25 PM IST

న్యూఢిల్లీ: కృష్ణానది జలాలపై  కొత్త ట్రిబ్యునల్  ఏర్పాటు అంశానికి  సంబంధించి  కేంద్రంలో  కదలిక వచ్చింది. ఈ విషయమై  అభిప్రాయం చెప్పాలని అటార్నీ జనరల్  వెంకటరమణిని కేంద్రం కోరింది.  అయితే  గతంలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున  పలు కేసులను వాదించిన  వెంకటరమణి ఈ విషయమై  తన అభిప్రాయం చెప్పేందుకు  నిరాకరించారు. దీంతో  ఈ  విషయమై  అభిప్రాయం చెప్పాలని  సొలిసిటర్ జనరల్ తుషార్ మోహతాను  కేంద్ర ప్రభుత్వం  కోరింది. . కృష్ణాపై  కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు  విషయమై  సొలిసిటర్ జనరల్  ఇచ్చే అభిప్రాయం ఆధారంగా   కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి  కృష్ణానదిలో  బచావత్ ట్రిబ్యునల్  811 టీఎంసీలను కేటాయించింది.  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల  విభజన జరిగిన నేపథ్యంలో  నదీ జలాల పున: పంపిణీ జరగాలని  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తుంది. 

తెలంగాణ  రాష్ట్రం ఏర్పాటైన  తర్వాత  2014 లోనే   కొత్త ట్రిబ్యునల్ ను  ఏర్పాటు  చేయాలని  కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది.   బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును నోటిఫై  చేయవద్దని కోరింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును నోటిఫై చేయకముందే  కొత్త ట్రిబ్యునల్ ను ఏర్పాటు  చేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్  చేస్తుంది.  ఇదే  డిమాండ్ తో  సుప్రీంకోర్టులో  కూడా  తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు  చేసింది. 

కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటును  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా  వ్యతిరేకిస్తుంది.  బచావత్  ట్రిబ్యునల్ తీర్పు మేరకు  రెండు రాష్ట్రాలు నదీ జలాలను పంచుకోవాలని కోరుతుంది.  అంతరాష్ట్ర నదీ జలాల  వివాదం  చట్టం 2002 ప్రకారం   ట్రిబ్యునల్   అవార్డులపై గెజిట్  నోటిఫై  చేసిన తర్వాత సమీక్ష కోరడానికి  వీల్లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తుంది.  అంతే కాదు సవరించిన  నదీ జలాల వివాదాల చట్టం  2002  కూడ ఇదే  చెబుతుందని  ఆంధ్రప్రదేశ్   గుర్తు చేస్తుంది.  

సుప్రీంకోర్టులో  దాఖలు చేసిన పిటిషన్ ను ఉపసంహరించుకుంటే  కృష్ణా నదిపై  కొత్త ట్రిబ్యునల్  ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం  తెలంగాణ  సర్కార్ కు సూచించింది. కేంద్రం సూచనతో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ ప్రభుత్వం  వెనక్కి తీసుకుంది. 

దరిమిలా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు అంశానికి  సంబంధించి అటార్నీ జనరల్ అభిప్రాయం కోరింది కేంద్ర ప్రభుత్వం.. అటార్నీ జనరల్ ఈ విషయమై  అభిప్రాయం చెప్పేందుకు  నిరాకరించారు. దరిమిలా  ఈ ఫైల్ ను  కేంద్ర ప్రభుత్వం సొలిసిటర్ జనరల్ కు పంపింది.   సొలిసిటర్ జనరల్ నిర్ణయం ఆధారంగా  కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు విషయమై  కేంద్రం  అడుగులు వేయనుంది. 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య  ఇప్పటికే  కొన్ని ప్రాజెక్టుల విషయంలో  వివాదాలు సాగుతున్నాయి.  అక్రమంగా  ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని  రెండు రాష్ట్రాలు  పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. అంతేకాదు  కోర్టుల్లో  కూడా  కేసులు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
 

Follow Us:
Download App:
  • android
  • ios