ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. నెంబర్లు చూసి విమర్శలు చూస్తే బాగుంటుందని ఆమె చురకలంటించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ . గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తమపై విమర్శలు చేస్తున్నారని, మీ సంగతేంటని ప్రశ్నించారు. కరీంనగర్, ఖమ్మం జిల్లాలో మెడికల్ కాలేజీలు వున్నాయని.. మళ్లీ ఆ జిల్లాలకే ప్రతిపాదనలు పెట్టారని ఆమె దుయ్యబట్టారు. మెడికల్ కాలేజీలు ఏ జిల్లాల్లో వున్నాయో కేసీఆర్‌కే తెలియదని నిర్మల సెటైర్లు వేశారు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థపై జోకులు వద్దని నిర్మల హెచ్చరించారు. 2014లో తెలంగాణ అప్పులు రూ.60 వేల కోట్లని, ఇప్పుడు రూ.3 లక్షల కోట్లు దాటిందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. నెంబర్లు చూసి విమర్శలు చూస్తే బాగుంటుందని ఆమె చురకలంటించారు. ప్రజల కోసం చేపట్టిన కార్యక్రమాన్ని వెక్కిరిస్తున్నారా అని నిర్మల ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి డేటా సరిగా లేదని, అలాంటప్పుడు నో డేటా అనేది ఎవరికి వర్తిస్తుందో చెప్పాలని ఆమె ఎద్దేవా చేశారు.
కాగా.. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రధాని మోడీ, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్. మేకిన్ ఇండియా జోకింగ్ ఇండియా అయ్యిందని.. తాను చెప్పినదాంట్లో ఒక్క అబద్ధం వున్నా రాజీనామా చేస్తానని కేసీఆర్ సవాల్ విసిరారు. తన మాటలకు కట్టుబడి వుంటానని.. కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని ముంచాయని సీఎం ఆరోపించారు. కాంగ్రెస్‌ది లైసెన్స్ రాజ్ అని.. మోడీది సైలెన్స్ రాజ్ అని కేసీఆర్ సెటైర్లు వేశారు. ఎన్‌డీఏ అంటే నో డేటా అవైలబుల్ అని.. ఏం అడిగినా ఎన్‌డీఏ అంటారంటూ ఆయన విమర్శించారు. దేశ ఆర్ధిక మంత్రి వచ్చి డీలర్‌తో కొట్లాడిందని.. ఏం సాధించారని మోడీ ఫోటో పెట్టాలని కేసీఆర్ ప్రశ్నించారు. ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటేయ్యాలని సీఎం నిలదీశారు.
ALso REad: ఇదీ దేశంలో పరిస్దితి..అబద్ధమైతే రాజీనామా చేస్తా : అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ సవాల్
దేశం పరిస్ధితి క్రిటికల్‌గా వుంటే మోడీ మాట్లాడరని.. ఏదైనా తప్పు జరిగితే ఒప్పుకునే ధైర్యం వుండాలని కేసీఆర్ స్పష్టం చేశారు. తలసరి ఆదాయంలో బంగ్లాదేశ్, శ్రీలంక కంటే భారత్ ర్యాంక్ తక్కువని సీఎం తెలిపారు. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అనేది పెద్ద జోక్ అన్నారు. మనదేశం 3.3 ట్రిలియన్ డాలర్ల దగ్గరే ఆగిపోయిందని.. మొత్తతం 192 దేశాల్లో మనదేశం ర్యాంక్ 139 అని కేసీఆర్ తెలిపారు. మోడీకి సలహాలు ఇచ్చేవాళ్లు సరిగా ఇవ్వాలని సీఎం చురకలంటించారు. భారతదేశ విషయాలు హిండెన్ బర్గ్ బయటపెట్టిందని.. ఇంత జరుగుతున్నా అదానీపై మోడీ ఒక్క మాట కూడా మాట్లాడడని ఆయన దుయ్యబట్టారు. దీనిపై పార్లమెంట్‌లో బీఆర్ఎస్,కాంగ్రెస్ కొట్లాడాయని కేసీఆర్ గుర్తుచేశారు.
ఒక్క వందే భారత్ రైలును మోడీ ఎన్నిసార్లు ప్రారంభిస్తారని కేసీఆర్ సెటైర్లు వేశారు. బర్రె గుద్దితే వందే భారత్ రైలు పచ్చడైందని.. కేంద్ర మంత్రి లిఫ్ట్‌లను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారంటూ సీఎం సెటైర్లు వేశారు. ఇదేనా దేశాన్ని నడిపే పద్ధతని కేసీఆర్ ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం జనాభా లెక్కలు ఎందుకు చేయడం లేదని ఆయన నిలదీశారు. 140 ఏళ్ల చరిత్రలో ఒక్కసారి కూడా జనాభా లెక్కలు ఆగలేదని.. ప్రపంచ యుద్ధాలు వచ్చినా జనగణన ఆగలేదని కేసీఆర్ గుర్తుచేశారు. తన బండారం బయటపడుతుందనే మోడీ జనగణన చేయడం లేదని సీఎం ఆరోపించారు. జనాభా లెక్కలు లేకుండా ఏ దేశం కూడా పాలన చేయడం లేదని ఆయన తెలిపారు. మోడీ ప్రభుత్వం తాము చెప్పిందే చేయాలని లేదంటే చంపుతామని అన్నట్లుందని కేసీఆర్ ఎద్దేవా చేశారు. సందు దొరికితే తెలంగాణను బద్నాం చేయాలనే ఆలోచనలో వున్నామని.. కాంగ్రెస్, బీజేపీ రెండూ దొందూ దొందేనని సీఎం చురకలంటించారు.
