ఐదేళ్లుగా టీచర్ పోస్టుల కోసం కండ్లల్ల వత్తులేసుకుని ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ సర్కారు ముష్టి వేసినట్లు డిఎస్సీ వేసిందని విమర్శించారు తెలంగాణ నిరుద్యోగ జెఎసి ఛైర్మన్ కోటూరి మానవత్ రాయ్. ముష్టి 8792 TRT నోటిఫికేషన్ పోస్టులకే తాగే పాలన్నీ కేసిఆర్ భజన బృందం నేలపాలు చేస్తున్నదని మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం 2012లో ఇచ్చిన నోటిఫికేషన్ ని కెసిఆర్ ఉద్యమ సమయంలో బ్రేక్ చేయించి తిరిగి మూడేళ్ళకు అవే ఉద్యోగాలు భర్తీ చేయటం నిరుద్యోగులను మోసంచేయటమే అని కోటూరి విమర్శించారు. మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఉత్తుతి నోటిఫికేషన్ జారీ చేశారని విమర్శించారు. మెగా డిఎస్సీ వేయాలని లేదంటే TRT ద్వారా రాష్ట్రంలో  ఖాళీ గా ఉన్న మొత్తం  40 వేల టీచరు ఉద్యోగాలు ఒకేసారి భర్తీచేయాలని డిమాండ్ చేశారు.

డిగ్రీ మార్కుల పర్సంటేజ్ తో సంబంధం లేకుండా NCTE నామ్స్ ప్రకారం EDCET(ఎడ్ సెట్)/DEECET(డిసెట్) ప్రకారం TRT లో అందరికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల మధ్య గొడవలు సృష్టించకుండా పోస్టులు లేని జిల్లాల్లో సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి రాజ్యాంగబద్ధ TRT నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు.

తెలుగు మాధ్యమం ప్రాతిపదికనే SGT పోస్టులు భర్తీ చేసి తర్వాత ఆంగ్ల మాధ్యమం లో ఒక సంవత్సరం శిక్షణ ఇచ్చి ఆంగ్లమాధ్యమ పాఠశాలల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2012 నుండి ప్రభుత్వం డిఎస్సీ నోటిఫికేషన్ వేయనందున ప్రస్తుత వయోపరిమితిని కూడా పెంచాలన్నారు. అన్ని బ్యాక్ లాగ్ టీచరు ఉద్యోగాలను రిజర్వేషన్ల వారిగా భర్తీ చేయాలని కోరారు.

త్వరలో పదవీవిరమణ చేయనున్న టీచరు పోస్ట్  లను కూడా ఈ నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేయాలని, దీనిద్వారా సుమారు 6 వేల టీచరు పోస్టులు పెరిగే అవకాశం ఉందని తెలంగాణ విద్యార్థి నిరుద్యో జెఏసి చైర్మన్ కోటూరి మానవతా రాయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.