ఓ రిమాండ్ ఖైదీ పోలీసులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు. కరోనా లక్షణాలు చూపించి పోలీసులను హైరానా పెట్టాడు. ఆ తర్వాత తెలివిగా తప్పించుకోవాలని చూశాడు. ఈ సంఘటన వరంగల్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చోరీ కేసులో ఇటీవల ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతనిని రిమాండ్ లో ఉంచగా... కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలతో హైరానా సృష్టించాడు. కరోనా సోకిందేమోననే అనుమానంతో అతనిని జైలు సిబ్బంది చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తీసుకెళ్లారు. 

అతనికి కాపాలాగా ఇద్దరు సిబ్బందిని కూడా ఉంచారు. అయితే... వాళ్లు భోజనానికి వెళ్లిన సమయంలో ఖైదీ తప్పించుకొని పరారయ్యాడు. రిమాండ్ ఖైదీ తప్పించుకొని పారిపోయిన విషయాన్ని జైలు సిబ్బంది మట్టెవాడ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అతడికి కరోనా లక్షణాలు ఉండటంతో.. వైద్య సిబ్బంది ఆందోళన చెందారు.

కాగా..పరీక్షల్లో అతనికి నెగిటివ్ అని రావడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా.. నిందితుడు హన్మకొండ సుబేదారికి చెందిన సయ్యద్ ఖైసర్‌గా గుర్తించారు. కాగా ఎట్టకేలకు నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.