హైదరాబాద్  లో పోరగాళ్ల సూపర్  బైక్ లు ఎక్కువవుతున్నాయి. తల్లిదండ్రుల బాధ్యతా రాహిత్యమే కారణమంటున్న పోలీసులు

.

హైదరాబాద్ రోడ్ల మీద పోరగాళ్ల జోరు ఎక్కువయింది. ఇది కొంచెం ఆందోళన కలిగిస్తా ఉందని పోలీసులు అంటున్నారు.

అసలే ట్రాపిక్ తో సతమతమవుతున్న హైదరాబాద్ ప్రజలకు రయ్ మని దూసుకొచ్చే సూపర్ బైక్ లు చాలా చికాకు కల్గిస్తున్నాయి. దానికి తోడు ఈ సూపర్ బైక్ లను నడిపేది పోరగాళ్లు అంటే డ్రైవింగ్ లెసెన్స్ తీసుకునే వయసు కూడా రాని పిల్లలే.

కొడుకులకు నూనూగు మీసం కట్టు మొలవడానికి ముందే బైకులు కొనిపించే తల్లితండ్రులు ఎక్కువయ్యారు. తమ కొడుకు సూపర్ బైక్ నడపుతూ ఉంటే వాడిలో సినిమాహీరోలను చూసుకునే తల్లితండ్రుల వల్ల ఈ సమస్య వస్తూ ఉందని ఒక సీనియర్ పోలీసాఫీర్ చెప్పారు.

హైదరాబాద్ లో పోరగాళ్లు (అండర్ ఏజ్ )బైక్ లు నడపడం గత మూడేళ్లలో 49 శాతం పెరిగింది. ఇది చట్ట వ్యతిరేకమయినా సరే ఈ ట్రెండ్ ఆగడం లేదు. ఇలా సూపర్ బైక్ లమీద రోడ్ల మీదకు వస్తున్న పోరగాళ్ల కు పెద్దగా శిక్ష లు పడకుండా పోవడం కూడా ఈ ట్రెండ్ పెరగడానికి కారణమయింది. 2103 లో పోరగాళ్ల మీద 55 కేసులు అండర్ఏజ్ డ్రయివింగ్ కేసులు నమోదయితే, ఈ ఏడాది కేసుల సంఖ్య 2676 కు చేరుకుంది. అయితే, మోటార్ వెహికిల్స్ యాక్ట్ సెక్షన్ 180, 181 ల కింద ఒక్కరికి కూడాశిక్ష పడలేదు.

ఆర్టిఎ లెక్కల ప్రకారం ఈ ఏడాది హైదరాబాద్ లో 685 సూపర్ బైక్ లు ( 250 సిసి లేదా అంతకంటే ఎక్కువ సిసి) రిజిస్టర్ అయ్యాయి. ఇపుడు నగరంలో దాదాపు 4500 నుంచి 5000 సూపర్ బైక్ లు ఉంటాయని అంచనా.16 సంవత్సరాల వయసు ఉన్నవారికి 60సిసి గేర్ లెస్ వాహనం లైసెన్స్ ఇచ్చేందుకు ఒక రూల్ ఉంది. దీనిని దుర్వినియోగం చేయడం, అవినీతి కారణంగా 16 సంవత్సరాలకే లైనెన్స్ లొస్తున్నాయి. ఇటీవల నూతన సంపన్నులు తమ పిల్లలకు 500 సిసి బైక్ లను అందించి తమ కొడుకులు సినిమా హీరోలవుతున్నారని గర్వపడుతున్నారట.

ఈ బైక్ ల మీద లక్షల్లో ఖర్చు చేసేందుకు వారంతా ఉత్సాహంచూపుతున్నారని ఒక పోలీసధికారి ఏషియానెట్ కు చెప్పారు.

హైదరాబాద్ నుంచి ఈ ట్రెండ్ ఇపుడు జిల్లాలకు కూడా పాకుతూ ఉందని ఒక ఎస్ పి చెప్పారు. ‘ దీనికి పేరెంట్స్ నే నిందించాలి. ఇది చాలా బాధ్యతా రహితమయిన పిల్లల పెంపకం.డబ్బుసంపాదన పెరుగుతూ ఉండటంతో సూపర్ బైక్ లను కొనివ్వడం అంటు వ్యాధిలా వ్యాపిస్తున్నది. ఒక ఇంట్లో కొనిస్తే పక్కనున్న వాళ్లు కూడా పోటీ పడుతున్నారు,’ అని ఈ అధికారి చెప్పారు.