చేతికందివచ్చిన ఇద్దరు కొడుకులు కేవలం 15 రోజుల వ్యవధిలోనే  గుండెపోటుతో మృతిచెంది ఆ తల్లిదండ్రులకు తీరని పుత్రశోకాన్ని మిగిల్చారు. 

కరీంనగర్ : కేవలం పదిహేను రోజుల వ్యవధిలోనే అన్నదమ్ములిద్దరు గుండెపోటుతో మృతిచెందారు. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. చేతికందివచ్చిన కొడుకులిద్దరూ ఇలా ఒకరి తర్వాత ఒకరు మృతిచెందడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుండ గ్రామానికి చెందిన ఉమ్మెంతల చంద్రారెడ్డి, అరుణ దంపతులకు ఇద్దరు కొడుకులు సంతానం. ఇద్దరు కొడుకుల చదువులు పూర్తయి ఒకరు కరీంనగర్ లో ఇంకొకరు హైదరాబాద్ లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరు కొడుకులు ఉద్యోగాలు చేస్తూ ఎవరికాళ్లపై వాళ్లు నిలబడటంతో తల్లిదండ్రులు హాయిగా రిటైర్మెంట్ జీవితం గడుపుతున్నారు. ఇలా ఆనందంగా సాగుతున్న వారి జీవితంలో ఒక్కసారిగా తలకిందులయ్యింది.

హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపనీలో పనిచేస్తున్న చంద్రారెడ్డి చిన్నకొడుకు మధుసూదన్ రెడ్డి(26) ఈ నెల (ఆగస్ట్) 3న గుండెపోటుకు గురై మృతిచెందాడు. చిన్న వయసులోనే కొడుకు గుండెపోటుతో మృతిచెందడం ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. ఈ బాధనుండి బయటపడకుండానే ఆ తల్లిదండ్రులు మరో కొడుకును కూడా కోల్పోయారు.

Read More Hyderabad : హుషారుగా షటిల్ ఆడుతూ... సడన్ గా కుప్పకూలి వ్యక్తి మృతి... ఏమయ్యిందంటే..

ఈ నెల 13న మధుసూదన్ రెడ్డి చిన్నకర్మ నిర్వహిస్తుండగా అన్న శ్రీకాంత్ రెడ్డి కూడా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో అతడిని తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న(బుధవారం) శ్రీకాంత్ ప్రాణాలు కోల్పోయాడు. ఇలా కేవలం పదిహేను రోజుల వ్యవధిలోనే ఇద్దరు బిడ్డలు మృతిచెంది ఆ తల్లిదండ్రులకు తీరని పుత్రశోకం మిగిలింది. 

సోదరులిద్దరి మృతితో రేణిగుంట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నారు. కొడుకులిద్దరినీ తలచుకుని చంద్రారెడ్డి, అరుణ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించడం అందరిచేతా కన్నీరు పెట్టిస్తోంది. పుత్రశోకంలో మునిగిన ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరివల్లా కావడంలేదు.