తాండూరు: అత్తారింటికి వచ్చిన ఇద్దరు అల్లుళ్లు ప్రమాదవశాత్తు మృతిచెందిన విషాద సంఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కల్లు తాగి అదే మత్తులో బావమరిదితో కలిసి ఈతకు వెళ్లిన ఇద్దరు తోడల్లుళ్లు నీటమునిగి చనిపోయారు.  

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మండలం కొత్లాపూర్‌ గ్రామానికి చెందిన వడ్డె వెంకటప్ప, శ్యామప్ప అన్నదమ్ములు. వెంకటప్ప కూతురు మాధవికి సిరిగిపేటకు చెందిన కృష్ణ(31)తో, శ్యామప్ప కూతురు రేణుకకు గిరిజాపూర్ కు చెందిన మహిపాల్(25)తో వివాహం జరిగింది. ఓ పాలిషింగ్‌ యూనిట్లో పనిచేసే కృష్ణ, మహిపాల్ ఇటీవల ఉపాధి కోల్పోయారు. దీంతో కొద్దిరోజులగా వారు పని లేక ఖాళీగా వున్నారు. 

ఈ క్రమంలో మల్కాపురం గ్రామంలోని ఓ పాలిషింగ్‌ యూనిట్‌ లో పని మాట్లాడుకునేందుకు వెళ్లిన కృష్ణ, మహిపాల్ అక్కడినుండి నేరుగా అత్తవారింటికి వెళ్లారు. అక్కడ కల్లు తాగిన ఇద్దరు బావమరిది నర్సింహులుతో కలిసి గ్రామ సమీపంలో ఓ వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లారు. మహిపాల్ కు ఈత రాకపోయినా ఓ డబ్బాను నడుముకు కట్టుకుని బావిలోకి దిగాడు. ఈ క్రమంలో అతడు నీటమునిగిపోతుండగా కృష్ణ కాపాడే ప్రయత్నం చేశాడు. అయితే ఇద్దరూ మత్తులో వుండటంతో నీటమునిగి ఊపిరాడక మృత్యువాతపడ్డారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మోటార్లతో నీటిని తోడి మహిపాల్, కృష్ణ  మృతదేహాలను బయటకు తీశారు. రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇలా ఒకేసారి ఇద్దరు అల్లుళ్లు చనిపోయి కూతుర్లు ఒంటరివారు అవడంతో ఆ కుటుంబం కన్నీటిపర్యంతం అయ్యారు.