తెలంగాణలో కురుస్తున్న అకాలవర్షాలకు పిడుగుపాట్లు తోడవడంతో పంటనష్టమే కాదు ప్రాణనష్టం కూడా జరుగుతోంది. 

హైదరాబాద్ :తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలు రైతులను నిండా ముంచడమే కాదు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. ఎండాకాలంలో కురుస్తున్న భారీ వర్షాలు చేతికందివచ్చిన పంటలను నాశనం చేయడంతో తీవ్ర నష్టాలపాలైన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక ఈదురుగాలులు, ఉరుములు మెరుపులు, పిడుగుపాట్లతో కూడిన వర్షాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇలా నిన్న(ఆదివారం) భారీవర్షంతో పాటు పిడుగులు పడటంతో ఇద్దరు గొర్రెల కాపరులు బలయ్యారు. 

పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన కొమరయ్య(48) గొర్రెల పెంపకం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. తోటి కాపరులతో కలిసి తన గొర్రెల మందను మేత కోసం గ్రామ శివారు ప్రాంతాలకు తీసుకుని వెళుతుండేవాడు. ఇలా నిన్న(ఆదివారం) కూడా మరో ఆరుగురు కాపరులతో కాపరులతో కలిసి మంగంపేట శివారులో గొర్లు కాయడానికి వెళ్ళాడు. అయితే సాయంత్రం వర్షం కురుస్తున్న గొర్లమందను అలాగే విడిచి వెళ్లలేక అక్కడే వున్నాడు. ఈ సమయంలోనే పిడుగు పడటంతో కొమరయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా గొర్ల కాపరులు దూరంగా వుండటంతో ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. 

పిడుగుపాటుతో కొమురయ్య మృతిచెందడంతో వెన్నంపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి భార్య కోమలత, ఇద్దరు కొడుకులతో పాటు మిగతా కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పెద్దదిక్కును కోల్పోయి రోడ్డునపడ్డ కొమరయ్య కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

Read More హైదరాబాద్‌లో భారీ వర్షం.. కరెంట్ షాక్‌తో గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ మృతి..

ఇదిలావుంటే సూర్యాపేట జిల్లాలోనూ ఇలాగే పిడుగుపాటుకు గొర్రెల కాపరి బలయ్యాడు. బాజిరెడ్డిగూడెం మండలం అడివెంల గ్రామానికి చెందిన సత్తయ్య వద్ద తిమ్మాపురం గ్రామానికి చెందిన సైదులు(38) గొర్ల కాపరిగా పనిచేస్తున్నాడు. రోజూ మాదిరిగానే ఆదివారం కూడా గొర్రెలు మేపడానికి గ్రామ శివారుకు వెళ్లిన సైదులు సాయంత్రం తిరిగి వస్తుండగా వర్షం మొదలయ్యింది. ఈ క్రమంలోనే అకస్మాత్తుగా పిడుగు పడటంతో సైదులు అక్కడికక్కడే మృతిచెందాడు. మందలోని నాలుగు గొర్లు కూడా మృతిచెందగా మరికొన్ని గాయాలపాలయ్యాయి. 

విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ, కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతోందని... దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింద. మరో మూడురోజులు (సోమ, మంగళ, బుధ) తెలంగాణలో ఇదే పరిస్థితి వుంటుందని పేర్కొన్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశాలున్న హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. పలుచోట్ల ఈదురుగాలులు, పిడుగులు, వడగళ్లతో కూడిన వర్షం పడుతుందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.