హైదరాబాద్‌ను మరోసారి వర్షం ముంచెత్తింది. గత రాత్రి కురిసిన భారీ వర్షం నేపథ్యంలో బైక్ అదుపు తప్పడంతో.. రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై పడిపోయి కరెంట్ షాక్‌తో ఓ గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మృతిచెందాడు.

హైదరాబాద్‌: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌ను మరోసారి వర్షం ముంచెత్తింది. గత రాత్రి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలుచోట్ల చెట్లు రోడ్లపై పడిపోయాయి. భారీ వర్షం నేపథ్యంలో బైక్ అదుపు తప్పడంతో.. రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై పడిపోయి కరెంట్ షాక్‌తో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ చెక్ పోస్టు సమీపంలో చోటుచేసుకుంది. మృతుడిని గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ వీరా స్వామిగా గుర్తించారు. వివరాలు.. గండిపేట గ్రే హౌండ్స్​లో పనిచేస్తున్న వీరా స్వామి కుటుంబంతో కలిసి అక్కడే నివాసం ఉంటున్నారు. 

ఆదివారం సాయంత్రం యూసఫ్‌గూడలో ఉంటున్న తమ్ముడిని కలిసేందుకు వీరాస్వామి వచ్చారు. తిరిగి రాత్రి బైక్‌పై గండిపేటకు బయలుదేరిన సమయంలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం, ఈదురుగాలుల నేపథ్యంలో జూబ్లీహిల్స్ చెక్​పోస్ట్ సమీపంలో వీరా స్వామి బైక్ అదుపుతప్పింది. దీంతో వీరాస్వామి రోడ్డు పక్కన ఉన్న ఫుట్​పాత్​పై పడిపోయాడు. అయితే అక్కడ ఉన్న ఎలక్ట్రిక్ పోల్‌కు వీరా స్వామి తగలడంతో.. అతడికి కరెంట్ షాక్ కొట్టింది. 

అయితే దీనిని గమనించిన పలువురు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వీరా స్వామి సీపీఆర్‌ నిర్వహించారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వీరా స్వామి మృతిచెందినట్టుగా వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనతో వీరాస్వామి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.