Asianet News TeluguAsianet News Telugu

ORR Accident: జీహెచ్ఎంసీ కార్మికులపైకి దూసుకెళ్లిన కారు... ఇద్దరు మృతి, ఒకరి పరిస్థితి విషమం

ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన  రోడ్డు ప్రమాదంలో విధుల్లో వున్న ఇద్దరు జిహెచ్ఎంసీ కార్మికులు మృతిచెందగా ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. 

Two GHMC Labours Death in ORR Road Accident
Author
Hyderabad, First Published Jan 28, 2022, 11:10 AM IST

హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు (outer ring road)పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విధుల్లో వున్న ఇద్దరు జీహెచ్ఎంసీ కార్మికులు మృతిచెందారు. రోడ్డుపక్కన మొక్కలకు నీరు పడుతుండగా ఓ కారు మృత్యువురూపంలో కార్మికులపైకి దూసుకువచ్చింది. ప్రమాదానికి కారణమైన కారులోని వ్యక్తి కూడా తీవ్రగాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. 

పోలీసుల కథనం ప్రకారం... మెదక్ జిల్లా హత్నూర్ మండలం వడ్డెపల్లికి చెందిన కంటిగారి సత్తయ్య(50) జీహెచ్ఎంసీ (GHMC) కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అలాగే నిజామాబాద్ జిల్లా తాడ్వాయి గ్రామానికి చెందిన పాపల నవీన్(19) నీటిని సరఫరా చేసే ట్యాంకర్ క్లీనర్ గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ గురువారం ఔటర్ రింగ్ రోడ్డుపై చెట్లకు నీరుపడుతూ ప్రమాదానికి గురయ్యారు.  

ప్రతిరోజులాగే హైదరాబాద్ (hyderabad) శివారులోని బొల్లారం వద్ద ఓఆర్ఆర్ పై వీరు ట్యాంకర్ లో తీసుకువచ్చిన నీటిని మొక్కలకు పోయసాగారు. అదే సమయంలో రామచంద్రాపురానికి చెందిన మహేశ్వర్ రెడ్డి కారులో ఔటర్ పై ప్రయాణిస్తున్నాడు. అయితే కారు మంచి వెగంలో వుండగా అదుపుతప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. ఇలా సరిగ్గా సత్తయ్య, నవీన్ మొక్కలకు నీరుపడుతున్న ప్రాంతంలోని కారు అదుపుతప్పి వారిపైకి దూసుకెళ్లింది.  

కారు దూసుకువస్తోంది గమనించినా తప్పించుకునే సమయమే వారిద్దరికి దొరకలేదు. సత్తయ్య, నవీన్ లను ఢీకొట్టిన కారు అలాగే ముందుకు దూసుకెళ్లి ట్యాంకర్ ను ఢీకొట్టి ఆగింది. సత్తయ్య, నవీన్ అక్కడికక్కడే మృతి చెందారు. కారులోని మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు.  

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసుల ఘటనా స్థలికి చేరుకుని కారులోంచి మహేశ్వర్ రెడ్డిని బయటకు తీసి హాస్పిటల్ కు తరలించారు. అనంతరం సత్తయ్య, నవీన్ మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం పటాన్ చెరు హాస్పిటల్ కు తరలించారు. మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తమవారిని కోల్పోయిన మృతుల కుటుంబసభ్యులు, బంధువుల రోదనలతో హాస్పిటల్ ప్రాంగణంలో మిన్నంటాయి. విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు కాబట్టి ప్రభుత్వమే బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అతివేగంగా, నిర్ల‌క్ష‌్యపు డ్రైవింగ్ వ‌ల్ల ఓఆర్ఆర్ పై త‌ర‌చూ ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. ఇటీవల కూడా ఇలాగే రాజేంద్రన‌గ‌ర్ వద్ద ఓఆర్ఆర్ పై రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. శంషాబాద్ ప్రాంతం నుంచి హైద‌రాబాద్ లోని గ‌చ్చిబౌలి వైపు వెళ్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. అతి వేగంగా ఈ ప్ర‌మాదానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని పోలీసులు తెలుపుతున్నారు 

 గ‌తేదాది నవంబ‌ర్ 22వ తేదీన అబ్దుల్లాపూర్ మెట్టు పోలీస్ స్టేషన్ పరిధి కోహెడ వద్ద ఔటర్ రింగు రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళుతున్న గుర్తు తెలియని వాహనాన్ని కారు ఢీకొట్ట‌డంతో ఈ ప్ర‌మాదం చోటు చేకుంది. ఇందులో ఇద్ద‌రు త‌ల్లీ కూతుర్లు మృతి చెందారు. మ‌రో ముగ్గురు గాయాల‌ప‌ల‌య్యారు. 

అలాగే గ‌తేడాది అక్టోబ‌ర్ 8న రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. రెండు కార్లు మితిమీరిన వేగంతో ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కార్లలో ఉన్న ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి.  శంషాబాద్ నుంచి గచ్చిబౌలికి వెళ్తుండగా నార్సింగి సర్కింల్ వద్ద రెండు కార్లు అతివేగంగా వచ్చి ఒకదానికొకటి ఢీ కొట్టాయి. దీంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో గాయాల‌పాలైన వారిని వెంట‌నే హాస్పిట‌ల్ కు తీసుకెళ్లారు.  కారు నడుపుతున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాదంలో అక్కడిక్కడే మృతి చెందారు. 
 


 

Follow Us:
Download App:
  • android
  • ios