ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ కొమరం భీమం జిల్లాలో ఆదివారం నాడు నాటు పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు ఫారెస్ట్ అధికారులు గల్లంతయ్యారు. గల్లంతైన పారెస్ట్ బీట్ ఆఫీసర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read:గోదావరిలో మునిగిన పడవ: సురక్షితంగా బయటపడ్డ కార్మికులు

మహారాష్ట్రలోని ఆహేరి నుండి గూడెం వస్తుండగా  ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఆరుగురు పారెస్ట్ అధికారులు ఆహేరి నుండి గూడెం గ్రామానికి నాటు పడవలో ప్రాణహిత  నదిలో  ప్రయాణిస్తున్నారు.

చింతలమానెపల్లి మండలం గూడెం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకొంది.  ఆరుగురు ఫారెస్ట్ అధికారులు ఇవాళ ఉదయం మహారాష్ట్ర ప్రాంతానికి వెళ్లారు. కలప అక్రమ రవాణాను అరికట్టేందుకు ఫారెస్ట్ అధికారులు ఆదివారం నాడు నాటు పడవలో ప్రయాణించారు.

గూడెం వద్ద ప్రాణహిత నదిలో ఇద్దరు ఫారెస్ట్ బీట్ అధికారులు గల్లంతయ్యారు. కేతిని బీట్ ఆఫీసర్ బాలకృష్ణ, శివపల్లి బీట్ ఆఫీసర్ సురేష్‌లు  గల్లంతయ్యారు. మిగిలిన నలుగురు ఫారెస్ట్ అధికారులు సురక్షితంగా బయటకు వచ్చారు. గల్లంతైన ఇద్దరు ఫారెస్ట్ అధికారులు మహారాష్ట్ర వైపు ఉన్న ఒడ్డుకు చేరుకొన్నారా అనే కోణంలో కూడ గాలింపు చర్యలు చేపట్టారు.