మహబూబాబాద్: ఇంట్లో వెలుగులు నింపే కరెంటే రెండు కుటుంబాల్లో చీకట్లు నింపింది. కరెంట్ షాక్ గురయిన దంపతులను కాపాడే ప్రయత్నంలో మరో జంట బలయ్యింది. ఈ విషాద సంఘటన తెలంగాణలోని మహబూబాబాద్ లో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే... అమనగల్లుకు చెందిన సత్తయ్య-రాధమ్మ దంపతులు. అయితే రాధమ్మ ఇంటి ఆవరణలో ఉతికిన బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ వైర్లకు తాకింది. దీంతో ఆమె షాక్ కు గురవగా భర్త సత్తయ్య గమనించి కాపాడే ప్రయత్నం చేశాడు. దీంతో అతడు కూడా షాక్ కు గురయ్యాడు. 

దీన్ని గమనించిన ఎదురింట్లో ఉంటున్న లింగయ్య-లచ్చమ్మ దంపతులు వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారు కూడా విద్యుదాఘాతానికి గురయ్యారు. ఇలా రెండు జంటలు విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందారు. 

ఒక్కసారిగా రెండు కుటుంబాలకు చెందిన నలుగురు చనిపోవడంతో ఇరు కుటుంబాల్లోనే కాదు గ్రామంలోనూ విషాదఛాయలు అలముకున్నాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను మహబూబాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌ స్పందించారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నిరకాలుగా అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు.