వేర్వురు ఘటనల్లో రెండు బస్సుల్లో మంటలు.. ఎండల తీవ్రత, షార్ట్ సర్క్యూట్.. ఉన్నట్టుండి మండిపోతూ..

శుక్రవారం హైదరాబాద్ లో రెండు వేర్వురు ఘటనల్లో రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి.  డ్రైవర్ల అప్రమత్తం వల్ల ఎలాంటి ప్రాణనష్టం, తీవ్ర ఆస్తి నష్టం జరగలేదు. 

two buses caught fire In separate incidents in hyderabad - bsb

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో శుక్రవారం సాయంత్రం ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు ఎగిసి పడ్డాయి. ఈ ప్రమాదానికి కారణం ఎండల తీవ్రత అని తెలుస్తోంది.  నడుస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలెగిసిపడడంతో అందులో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బస్సులో మంటలు చెలరేగి.. బస్సు ఆగిన చోట పెట్రోల్ బంకు ఉండడంతో.. ఈ ప్రమాద తీవ్రత ఎంతగా పెరుగుతుందోనన్న భయాందోళనలు దారితీసింది.  అయితే డ్రైవర్ చాకచక్యంతో.. ప్రయాణికులందరూ కిందికి దిగడంతో ప్రాణ నష్టం జరగలేదు. 

ఒకసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాదాన్ని ఊహించిన డ్రైవర్.. ప్రయాణికులు అందరినీ వెంటనే కిందికి దించి తాను కూడా దిగిపోయాడు. మంటలను గమనించిన దగ్గర్లోని పెట్రోల్ బంకు సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు.  దీంతో పెను ప్రమాదం తప్పింది.  హైదరాబాదులోని బాలానగర్ ఠాణా పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి…

శుక్రవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఆరెంజ్ వోల్వో ట్రావెల్స్ బస్సు  నలుగురు ప్రయాణికులతో సుచిత్ర దగ్గర నుంచి కూకట్పల్లి వైపు బయలుదేరింది.  అక్కడి నుంచి బాలానగర్ మెయిన్ రోడ్ లోని ఐడిపిఎల్ సమీపంలోని హెచ్పి పెట్రోల్ బంక్  దగ్గరికి రాగానే ఒకసారిగా బస్సు ఇంజన్లో నుండి వేడి పొగలు వచ్చాయి. దీంతో ప్రమాదాన్ని అంచనా వేసిన డ్రైవర్.. బస్సులో ఉన్న నలుగురు ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. వెంటనే వారంతా కిందికి దిగారు.

ఆ వెంటనే బస్సును అక్కడికక్కడే ఆపేసిన డ్రైవర్ కిందికి దిగి దూరంగా పారిపోయాడు. ప్రయాణికులు కూడా దూరంగా వెళ్లిపోయారు. అయితే డ్రైవర్ బస్సు ఆపిన కొద్ది దూరంలోనే పెట్రోల్ బంక్ ఉంది. మంటలు తీవ్రస్థాయిలో ఎగిసిపడుతుండడంతో పెట్రోల్ బంక్ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. పెట్రోల్ బంకు వస్తున్న వాహనదారులను  దూరంగా పంపించారు. బంకులో ఉన్న అగ్నిమాపక సిలిండర్లతో మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు.

ఈలోపు ప్రమాద సమాచారం పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి తెలపడంతో.. వారు ఘటన స్థలానికి చేరుకున్నారు. సనత్ నగర్ అగ్నిమాపక కేంద్రానికి చెందిన సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక అధికారి ప్రదీప్ కుమార్ నేతృత్వంలో రెండు వాహనాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం కారణంగా బాలానగర్, జీడిమెట్ల నుంచి కూకట్పల్లి వైపు వెళ్తున్న వాహనాలు కిలోమీటర్ల దూరంలోనే నిలిచిపోయాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. 

ఆరు గంటలకు ప్రమాదం జరిగితే రాత్రి 8 గంటల తర్వాత పరిస్థితి కొంతవరకు అదుపులోకి వచ్చింది. అయితే ప్రమాదానికి కారణం ఎండల తీవ్రత వలన అని అగ్నిమాపక అధికారులు అంటున్నారు. ఎండ తీవ్రతతో బస్సు ఇంజన్లో మంటలు వ్యాపించాయని తెలిపారు. అంతకుముందు మూడు గంటల ప్రాంతంలో మియాపూర్ లోని జాతీయ రహదారి మీద ఓ ప్రైవేట్ బస్సులో మంటలేగిసిపడ్డాయి. అయితే ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్కు అత్యంత సమీపంలోనే చోటుచేసుకుంది.  దీంతో ఇది గమనించిన పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు ఆర్పేశారు. 

మధ్యాహ్నం మూడు గంటల సమయంలో జాతీయ రహదారి మీద బీరంగూడ వైపు నుంచి కూకట్పల్లి వైపుకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెళుతుంది. మదీనాగూడ దగ్గరికి రాగానే ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ బస్సును ఆపేశాడు. ఇది గమనించిన స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే దగ్గర్లోనే మియాపూర్ పోలీస్ స్టేషన్ ఉండడంతో వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించారు.  ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేరు. ఈ ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని ప్రాథమిక అంచనా.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios