ఇంటి నుంచి పని మీద బయటకు వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు ఒకరి తర్వాత మరొకరు ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సంఘటన వరంగల్  జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వర్గల్ మండలం అనంతగిరి పల్లి గ్రామానికి చెందిన తుమ్మల రామకృష్ణ, లక్ష్మణణ్ లు అన్నదమ్ములు. వారు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా.. చెల్లెలు భర్త యాట శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో చనిపోయాడు. అతను తూఫ్రాన్ సమీపంలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తుండగా కుమార్తెకు ఆ ఉద్యోగం ఇచ్చారు.

దీంతో రామకృష్ణ, లక్ష్మణ్ కుమారులు కరుణాకర్, అరవింద్ లు ప్రతిరోజూ ఆమెను అక్కడ దింపి వస్తుంటారు. యథావిధిగా ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున వారిద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై శ్రీనివాస్ కుమార్తెను సంస్థలో దింపి వస్తుండగా.. తూఫ్రాన్ పురపాలిక పరిధి అల్లాపూర్ వద్ద గజ్వేల్ రహదారిపై జరిగిన ప్రమాదంలో తుమ్మల కరుణాకర్ తీవ్రంగా గాయపడగా.. తమ్ముడు అరవింద్ అక్కడికక్కడే చనిపోయాడు.

తీవ్రంగా గాయపడిన కరుణాకర్(19) హైదరాబాద్ లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం చనిపోయాడు. దీంతో.. ఇద్దరు అన్నదమ్ములు ప్రాణాలు పోగొట్టుకోవడం కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.