హైదరాబాద్: టీవీ నటుడు అమీర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను హైదరాబాదులోని రాయదుర్గం పోలీసులు అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. మిత్రులపై దాడి చేసిన కేసులో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఓ బోటిక్ వ్యవహారంలో ఆయన స్నేహితులపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కోయిలమ్మ సీరియల్ లో అమీర్ హీరోగా నటించాడు.

అమీర్ అలియాస్ సమీర్ మీద ఇటీవల రాయదుర్గం పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. తాగిన మత్తులో మణికొండలో మణికొండలో ఉన్న ఇద్దరు అమ్మాయిలపై దాడికి దిగాడని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో తన ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసి తమ దగ్గర ఉన్న వస్తువులను లాక్కుని వెళ్లాడని ఓ మహిళ ఫిర్యాదు చేిసంది. 

శ్రీవిద్య, అపర్ణ కొద్ది రోజులుగా మణికొండలో బొటిక్ దుకాణం నడుపుతున్నారు. వారి నుంచి సమీర్ ఐదు లక్షల రూపాయల నగదు తీసుకున్నారని, డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే దౌర్జన్యం చేస్తున్నాడని మహిళలు ఆరోపించారు. 

బుల్లితెరపై కోయిలమ్మ సీరియల్ విశేష ప్రజాదరణ పొందింది. ఇది ఇప్పటికే ఎనిమిది వందల ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఈ సీరియల్ తో అమీర్ కు మంచి గుర్తింపు వచ్చింది. తన పాపులారిటీని సమీర్ దుర్వినియోగం చేస్తున్నాడని మహిళలు ఆరోపించారు.