Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌కు షాక్: మహాకూటమికి టీడీపీ కసరత్తు, చాడకు ఎల్. రమణ ఫోన్

టీఆర్ఎస్, బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమిని ఏర్పాటు చేయాలని తెలంగాణ టీడీపీ నిర్ణయం తీసుకొంది.  ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతోంది. 

Ttdp plans grand alliance in telangana for assembly elections
Author
Hyderabad, First Published Sep 9, 2018, 2:48 PM IST

హైదరాబాద్: టీఆర్ఎస్, బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమిని ఏర్పాటు చేయాలని తెలంగాణ టీడీపీ నిర్ణయం తీసుకొంది.  ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ మేరకు ఆదివారం నాడు సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డికి  ఎల్. రమణ ఫోన్ చేశారు.  సాయంత్రం నాలుగు గంటల తర్వాత  సమావేశం కావాలని నిర్ణయం తీసుకొన్నారు.

చంద్రబాబునాయుడుతో రెండు రోజుల పాటు  టీడీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కీలక నేతలు సమావేశమయ్యారు. సెప్టెంబర్ 8వ తేదీన తెలంగాణ టీడీపీ జనరల్ బాడీ సమావేశం జరిగింది. సెప్టెంబర్ 9వ తేదీన  తెలంగాణ పొలిట్ బ్యూరో సభ్యులతో  చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు.

ఎన్నికల్లో పొత్తుల విషయమై స్థానిక పార్టీ శాఖకే నిర్ణయాన్ని వదిలేశారు. అయితే పొత్తుల విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్ధేశం చేశారు. అయితే  టీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా  కలిసొచ్చే పార్టీలతో మహా కూటమిని ఏర్పాటు చేయాలని బాబు ఆదేశించారు.

ఈ మేరకు తెలంగాణ టీడీపీ నేతలు  చర్యలను ప్రారంభించారు. కలిసొచ్చే పార్టీలతో కలిసి పోటీ చేసేందుకు వీలుగా మహాకూటమిని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ శాఖకు చెందిన నేతలు  రంగం సిద్దం చేశారు.

బాబు అమరావతికి బయలుదేరి వెళ్లగానే సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డికి టీడీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ ఫోన్  చేశారు. ఆదివారం సాయంత్రం  కలుద్దామని చాడ వెంకట్ రెడ్డి  ఎల్. రమణకు సూచించాడు.

మరోవైపు సోమవారం నాడు  టీజేఎస్ తో  టీడీపీ నేతలు చర్చించనున్నారు.  మహాకూటమిలోకి పార్టీలను ఆహ్వానించేందుకు చర్చించడానికి వీలుగా ఓ కమిటీని కూడ ఏర్పాటు చేయనున్నారు.  దీనికితోడుగా  ఎన్నికల మేనిఫెస్టో, ప్రచార కమిటీలను కూడ ఏర్పాటు చేయనున్నారు.

రాజకీయంగా తెలంగాణలో తమను ఇబ్బందిపెట్టిన టీఆర్ఎస్ , బీజేపీలకు బుద్దిచెప్పే దిశగా  వ్యూహరచన చేస్తోంది టీడీపీ.  అయితే  ఈ మహా కూటమిలో ఏ ఏ పార్టీలు ఉంటాయనే దానిపై  ఇంకా స్పష్టత రాలేదు. ఈ కూటమిలో కాంగ్రెస్ పార్టీ చేరుతుందా.. సీపీఎం ను కూడ కలుపుకొని వెళ్తారా.. సీపీఎం ఇప్పటికే బీఎల్ఎఫ్ పేరుతో ఓ కూటమిని ఏర్పాటు చేసింది.

ఈ కూటమిని కాకుండా టీడీపీ ఏర్పాటు చేసే కూటమిలో సీపీఎం చేరుతోందా లేదా అనేది  ఇప్పటికిప్పుడే చెప్పలేం. టీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలను కూడగట్టే దిశగా టీడీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. మరో వైపు  కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమతో కలిసి పనిచేయాలని కోరింది.
అయితే టీడీపీయే  మహాకూటమి ఏర్పాటుకు ముందుకు రావడంతో కాంగ్రెస్ పార్టీ ఈ కూటమిలో చేరుతోందా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

అయితే  కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొంటే రాజకీయంగా ఏపీలో కూడ నష్టమే అనే భావన టీడీపీ వర్గాల్లో లేకపోలేదు. అందుకే మహాకూటమి ఏర్పాటు దిశగా టీడీపీ కార్యాచరణను ప్రారంభించిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.  

ఈ వార్తలు చదవండి

సీపీఐ, టీజేఎస్‌లకు టీడీపీ ఓకే: కాంగ్రెస్‌తో పొత్తుపై ఉత్కంఠ
40 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లపై గురి, కాంగ్రెస్ తొ పొత్తుపై టీడీపీ సస్పెన్స్

Follow Us:
Download App:
  • android
  • ios