Asianet News TeluguAsianet News Telugu

40 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లపై గురి, కాంగ్రెస్ తొ పొత్తుపై టీడీపీ సస్పెన్స్

టీడీపీ  తెలంగాణ   రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులతో  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  ఆదివారం నాడు హైద్రాబాద్‌లోని తన నివాసంలో సమావేశమయ్యారు

T.Tdp leaders meeting with chandrababu naidu in hyderabad
Author
Hyderabad, First Published Sep 9, 2018, 12:21 PM IST

 హైదరాబాద్:  టీడీపీ  తెలంగాణ   రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులతో  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  ఆదివారం నాడు హైద్రాబాద్‌లోని తన నివాసంలో సమావేశమయ్యారు. తెలంగాణలో పొత్తులు... ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే దానిపై చర్చిస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయడంతో త్వరలోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది.  అయితే  ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలంగాణ టీడీపీ నేతలకు దశ దిశను నిర్ధేశిస్తున్నారు.

సెప్టెంబర్ 8వ తేదీన చంద్రబాబునాయుడు తెలంగాణ టీడీపీ నేతలతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కొనసాగింపుగానే ఆయన మరోసారి ఇవాళ కూడ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాకుండా ఉండాలంటే కలిసివచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. టీడీపీతో కూడ పొత్తులకు తాము సిద్దంగా ఉన్నామని  కూడ పీసీసీ తెలంగాణ చీఫ్  ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత  బంగారు తెలంగాణ సాధన కోసం రాజకీయపునరేకీకరణ అవసరమనే పేరుతో టీఆర్ఎస్ చేసిన ఆపరేషన్ ఆకర్ష్‌లో  టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ, బీఎస్పీకి చెందిన ఎమ్మెల్యేలు  టీఆర్ఎస్ గూటిలో చేరారు.

దీంతో  తెలంగాణలో  టీడీపీ బలం గణనీయంగా పడిపోయింది.  ఆపరేషన్ ఆకర్ష్‌ కారణంగా  టీడీపీ నుండి కాంగ్రెస్, టీఆర్ఎస్‌లోకి నేతలు వలసలు వెళ్లారు. అయితే ఈ తరుణంలో  టీఆర్ఎస్‌ను అధికారానికి దూరం చేయడానికి కాంగ్రెస్ పార్టీ టీడీపీకి స్నేహ హస్తాన్ని  ఇస్తోంది. ఈ పరిణామాలపై టీడీపీ నేతలు చర్చిస్తున్నారు.

తెలంగాణలోని  40 అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు రెండు పార్లమెంట్ సీట్లను కోరాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఈ 40 సెగ్మెంట్లలో టీడీపీకి ఓటు బ్యాంకు ఉన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

మల్కాజిగిరి, ఖమ్మం పార్లమెంట్ సీట్లను అడగాలని భావిస్తున్నారు. అయితే  గెలిచే స్థానాలనే కోరాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించినట్టు సమాచారం.  2009 ఎన్నికల సమయంలో  టీఆర్ఎస్ కు 50 సీట్లు కేటాయించడంతో  ఆ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన విషయాన్ని బాబు ఈ సమావేశంలో గుర్తుచేసినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఖరారు చేసుకొంటే  రాజకీయంగా ఇబ్బందులు ఉంటాయా... అనే చర్చ కూడ లేకపోలేదు. టీఆర్ఎస్ తో పొత్తుకు కొందరు టీడీపీ నేతలు వ్యతిరేకతను వ్యక్తం చేశారని సమాచారం.

మరోవైపు ఎన్నికలను పురస్కరించుకొని  ఎన్నికల కమిటీ, ప్రచార కమిటీ, పార్టీ మేనిఫెస్టో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.ఈ కమిటీల విషయమై  చంద్రబాబునాయుడు ఇవాళ ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే  ఇతర పార్టీలతో  పొత్తు విషయమై కూడ ఆలోచించాలనే వాదన కూడ  లేకపోలేదు. కాంగ్రెస్ కాకుండా ఇతర పార్టీలు కలిసొచ్చేందుకు సానుకూలంగా ఉన్న పార్టీలతో చర్చించే అవకాశం ఉంది.వరంగల్ జిల్లాకు చెందిన కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు వ్యతిరేకంగా వాదనను విన్పించినట్టు సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios