హైదరాబాద్:తెలంగాణలో పొత్తులపై టీడీపీ కార్యాచరణను వేగవంతం చేసింది.కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.  సీపీఐ, టీజేఎస్‌ పార్టీలతో పొత్తుల విషయమై టీడీపీ నేతలు  చర్చించనున్నారు. మరో వైపు ఎన్నికలకు సంబంధించి మూడు కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉంటే కలిసివచ్చే పార్టీలతో చర్చించాలని బాబు టీడీపీ తెలంగాణ కమిటీ నేతలకు దిశానిర్ధేశం చేసినట్టు సమాచారం.

 టీడీపీ తెలంగాణ పొలిట్ బ్యూరో సభ్యులతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆదివారం నాడు సమావేశమయ్యారు.ఈ సమావేశంలో  తెలంగాణలో ఎన్నికల నిర్వహణ అంశంపై  చర్చించారు. ఎన్నికల విషయంలో ఏ రకంగా వ్యవహరించాలనే దానిపై  చర్చించారు.


ఎన్నికల కోసం మూడు కమిటీలను ఏర్పాటు చేయాలని  చంద్రబాబునాయుడుపార్టీ నేతలను ఆదేశించారు.  ప్రచారకమిటీ, మేనిఫెస్టో కమిటీ, ఇతర పార్టీలతో పొత్తుల విషయమై సంప్రదింపులు జరిపేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని బాబు సూచించారు. ఇవాళ సాయంత్రం లోపుగా కమిటీల సమాచారాన్ని తనకు అందించాలని బాబు కోరారు.

టీడీపీ నేతలతో సమావేశాన్ని ముగించుకొని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  అమరావతికి బయలుదేరారు.బాబుతో సమావేశాన్ని ముగించుకొన్న తర్వాత  తెలంగాణ టీడీపీ నేతలు మరోసారి  సమావేశమై  కమిటీల గురించి చర్చించనున్నారు.

ఇదిలా ఉంటే తెలంగాణలో సీపీఐతో పొత్తు విషయమై టీడీపీ నేతలు సానుకూలంగా ఉన్నారు. కోదండరామ్ ఏర్పాటు చేసిన టీజేఎస్ తో కూడ పొత్తుల గురించి చర్చించనున్నారు. ఆదివారం సాయంత్రం సీపీఐ నేతలతో  టీడీపీ నేతలు చర్చించనున్నారు. సోమవారం నాడు  కోదండరామ్ తో పొత్తులపై టీడీపీ నేతలు చర్చించే అవకాశం ఉంది.

అయితే కాంగ్రెస్ పార్టీతో పొత్తు విషయమై ఇంకా స్పష్టత రాలేదు.  పొత్తు విషయమై కాంగ్రెస్ పార్టీ నేతలు ఆజాద్ తో చర్చించాలా.. కుంతియాతో మాట్లాడాలా.. రాష్ట్ర నాయకులతో చర్చించాలా అనే దానిపై  ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకొంటుందని సమాచారం.

అయితే టీడీపీతో పొత్తుకు ఏ పార్టీలు సానుకూలంగా ఉన్నాయనే విషయమై పరిశీలించి చర్చలకు వెళ్లాలని భావిస్తున్నాయి. అయితే 40 అసెంబ్లీ, 2 పార్లమెంట్ సీట్లకు టీడీపీ పట్టుబట్టే అవకాశం ఉంది. అయితే  సీట్ల విషయంలో కొంత పట్టువిడుపు ధోరణిని అవలంభించాలని కూడ  ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. 

టీఆర్ఎస్ ను అధికారానికి దూరంగా ఉంచడమే లక్ష్యంగా పనిచేయడం కోసం సీట్ల కేటాయింపు విషయంలో పట్టు విడుపులు అవలంభించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. 

 

ఈ వార్త చదవండి

40 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లపై గురి, కాంగ్రెస్ తొ పొత్తుపై టీడీపీ సస్పెన్స్