రైతు పోరుబాట కార్యాచరణ రూపొందించుకోవాలని గట్టిగా చెప్పారు. రైతాంగం విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సహించవద్దన్నారు. ప్రజా సమస్యలపై పకడ్బందీగా ఉద్యమాలు చేయాలని నేతలను ఆదేశించారు. ప్రజా ఉద్యమాల ద్వారా టిడిపికి రాష్ట్రంలో పూర్వ వైభవం తీసుకురావాలని దిశా నిర్దేశం చేసారు.   మరి  ఏపిలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తుంటే ఎందుకు సహించలేకున్నారు.

ఆమధ్య ‘ఆడోరకం..ఈడోరకం’ అన్న సినిమా వచ్చింది. దాన్నే కొంచెం మార్చి ‘అక్కడో రకం.. ఇక్కడో రకం’ అని చదువుకోవాలి. ఇదంతా ఎందుకంటే చంద్రబాబు గురించే. ముఖ్యమంత్రై రెండున్నరేళ్ళవుతున్నా చంద్రబాబునాయడు ఇంకా తన రెండు కళ్ళ సిద్దాంతంతోనే ముందుకు వెళుతున్నట్లు కనబడుతోంది. ఒకే విషయంలో అధికారంలో ఉన్న ఏపిలో ఒక రకంగాను ప్రతిపక్షంలో ఉన్న తెలంగాణాలో ఇంకో రకంగాను వ్యవహరిస్తున్నారు.

ఇంతకీ విషయమేమిటంటే, శుక్రవారం తెలంగాణా టిడిపి నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఆ సందర్భంగా నేతలతో మాట్లాడుతూ, రైతు పోరుబాట కార్యాచరణ రూపొందించుకోవాలని గట్టిగా చెప్పారు. రైతాంగం విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సహించవద్దన్నారు.

అదే సమయంలో ప్రజా సమస్యలపై పకడ్బందీగా ఉద్యమాలు చేయాలని నేతలను ఆదేశించారు. ప్రజా పోరాటంలో ముందుండాలని చెప్పారు. ప్రజా ఉద్యమాల ద్వారా టిడిపికి రాష్ట్రంలో పూర్వ వైభవం తీసుకురావాలని దిశా నిర్దేశం చేసారు. అంత వరకూ బాగానే ఉంది. ప్రతిపక్షం అన్నాక ప్రజాపక్షం వహించాల్సిందే. ప్రజా సమస్యల పరిష్కారినికి పోరాటం చేయాల్సిందే. ప్రతిపక్షాలంటేనే ప్రజల గొంతు అని గతంలో ప్రజాస్వామ్య వాదులు చెప్పారు.

అందులో ఒక్క టిడిపి మాత్రమే కాదు ఏ పార్టీని కూడా తప్పుపట్టాల్సిన అవసరం లేదు. తెలగాణాలో టిడిపికి పూర్వ వైభవం తీసుకురావాలంటే అర్ధమేమిటి? టిడిపి మళ్లీ తెలంగాణాలో అధికారంలోకి రావాలనే కదా?

మరి అదే విషయమై ఏపిలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తుంటే ఎందుకు సహించలేకున్నారు. జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎందుకంత అసహనంతో వ్యవహరిస్తున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. అటు అసెంబ్లీలో మాట్లాడనివ్వరు, ఇటు బయట కూడా మాట్లాడేందుకు లేకుండా నిత్యమూ స్కూలు పిల్లలకు టైంటేబుల్ ఇచ్చినట్లుగా నేతలను నిత్యమూ జగన్ పై మాటలతో దాడులు చేయిస్తూనే ఉంటారు.

పోనీ జగనేమన్నా లేని సమస్యలతో రద్దాంతం చేస్తున్నారా అంటే అదీ లేదుకదా? పోయిన ఎన్నికల సమయంలో స్వయంగా చంద్రబాబు ఇచ్చిన రైతు, డ్వాక్రా, చేనేత రుణమాఫీలు ఏమేరకు అమలయ్యాయో అందరికీ తెలిసిందే. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవటంతో రైతులు, డ్వాక్రా మహిళలు నానా ఇబ్బందులు పడుతున్నది వాస్తవం.

అవే విషయాలను జగన్ ఉద్యమాల్లో ప్రస్తావిస్తున్నారు. అదే విధంగా, పచ్చ నేతల అవినీతి వ్యవహారాలకు పాల్పడుతున్నట్లు వైసీపీ ఆరోపణలు చేస్తున్నది. రాజధాని అమరావతి నిర్మాణం పేరుతోను, భూ సమీకరణ వ్యవహారంలోను పచ్చ పార్టీ నేతలు భారీ ఎత్తున భూ కుంబకోణాలకు పాల్పడ్డారని రాజధాని ప్రాంత రైతులే బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నదీ వాస్తవమే. అవే విషయాలను జగన్ ప్రస్తావిస్తున్నారు.

 ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రత్యేకహోదా, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ వ్యవహారాలు ఏ మేరకు దక్కిందీ అందరికీ విధితమే. సదరు వ్యవహారాలను కదా జగనైనా మిగిలిన ప్రతిపక్షాలైన అడుగుతున్నది. మరి, ఉన్న విషయాలనే, జరుగుతున్న వాటిని ప్రతిపక్షాలు ప్రస్తావిస్తుంటే మొత్తం ప్రతిపక్షాలన్నింటినీ అభివృద్ధి నిరోధకులుగా చంద్రబాబు వ్యవహరించటమేమిటని పలువురు ఆశ్చర్యపోతున్నారు.

అంటే, తాను ప్రతిపక్షంలో ఉన్న పొరుగు రాష్ట్రంలో ఏమో వెంటనే అధికారంలోకి వచ్చేయాలి. తాను అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఏమో ప్రతిపక్షాలుండకూడదు వాటి గొంతు వినబడకూడదన్నది చంద్రన్న రెండు కళ్ల సిద్ధాంతంలాగ కనబడుతోంది.