వర్షాకాలంలో కరెంట్‌తో జాగ్రత్త .. టీఎస్ఎస్‌పీడీసీఎల్ సీఎండీ సూచనలు, ఎమర్జెన్సీ అయితే టోల్‌ఫ్రీ నెంబర్లు ఇవే
తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో టీఎస్ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి.. చీఫ్ జనరల్ మేనేజర్, సూపరింటెండెండింగ్ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. అలాగే వర్షాలు పడుతున్న నేపథ్యంలో రఘుమారెడ్డి ప్రజలకు కీలక సూచనలు చేశారు

తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది . గురువారం టీఎస్ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి.. చీఫ్ జనరల్ మేనేజర్, సూపరింటెండెండింగ్ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా రఘుమా రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మా విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉందన్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి 345 కరెంట్ స్తంభాలు పడిపోయాయని, వీటిలో చాలా వరకు పునరుద్ధరణ చేశామని సీఎండీ వెల్లడించారు. ఇంత వర్షం ఉన్నప్పటికీ ఎక్కడా కరెంట్ పోవడం లేదని రఘుమారెడ్డి స్పష్టం చేశారు.
భారీ వర్షాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు తమ ఉద్యోగులు, ఇంజనీర్స్ పర్యవేక్షణ చేస్తున్నారని, అధికారులకు సెలవులు రద్దు చేశామని సీఎండీ తెలిపారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసి విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని అదేశించామన్నారు. ఇంజనీర్స్ , ఇతర అధికారులు హెడ్ క్వార్టర్స్ లోనే ఉండాలని లేకుంటే కఠిన చర్యలు ఉంటాయని రఘుమా రెడ్డి హెచ్చరించారు. వర్షాల కారణంగా ఏమైనా నష్టం వాటిల్లితే వెంటనే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సీఎం ఆదేశించారు.
అలాగే వర్షాలు పడుతున్న నేపథ్యంలో రఘుమారెడ్డి ప్రజలకు కీలక సూచనలు చేశారు:
- ప్రజలు విద్యుత్ స్తంభాలు, వైర్లు నీళ్లలో ఉన్న కరెంట్ వైర్లను ఎట్టిపరిస్థితుల్లోనూ తాకవద్దు.
- విద్యుత్ వైర్లు , ట్రాన్స్‌ఫార్మర్ల కింద నిలబడరాదు. పశువులను, పెంపుడు జంతువులను విద్యుత్ పరికరాలకు దూరంగా వుంచాలి.
- ఎక్కడైనా వైర్లు తెగితే తమ సంస్థ టోల్ ఫ్రీ , ఇతర కంట్రోల్ రూమ్ నంబర్ లకు పోన్ చేసి ఫిర్యాదు చేయండి.
- అత్యవసర పరిస్ధితుల్లో 1912 , 100, 7382071574, 7382072106 , 7382072104 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలి.
- 24 గంటల పాటు కంట్రోల్ రూమ్‌లో సిబ్బంది అందుబాటులో ఉంటారు.
- వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు ఉంటాయి అలాంటప్పుడు ఇంట్లో కరెంట్ ఆఫ్ చేయండి.
- లోతట్టు ప్రాంతాలు జలమయమైనప్పుడు ఫిర్యాదు చేస్తే ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడం కానీ లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాము.
- అపార్ట్‌మెంట్ సెల్లార్‌లలో మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు వాటితో విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మీటర్లను మీ పోర్షన్లలోకి పెట్టేందుకు మా సిబ్బంది సంప్రదించండి