TSRTC Mahalakshmi Scheme : సీటు కోసం మహిళల సిగపట్లు ... అంతరించిన కళను తట్టిలేపారంటూ సెటైర్లు
మహాలక్ష్మి పథకంతో తెలంగాణ ఆర్టిసి బస్సుల్లో మహిళా ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీంతో సీట్ల కోసం బట్టలు చిరిగేలా జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్నారు కొందరు మహిళలు.
హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నెరవేర్చిన మొదటి హామీ మహిళలకు ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీలను అమలును ఈ పథకంతోనే శ్రీకారం చుట్టారు. ప్రభుత్వానికి ఆర్థిక భారం అయినా, ఆర్టిసి మరింత నష్టాల్లో కూరుకుపోయే అవకాశాలున్నా ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఈ ఉచిత ప్రయాణ పథకాన్ని అమలుచేస్తోంది రేవంత్ సర్కార్. కానీ కొందరు మహిళలకు ఇవేమీ పట్టడంలేదు... ఈ ఉచిత ప్రయాణ పథకానికే చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. మహిళలకు మహిళలే శత్రువులు అనే నానుడిని నిజం చేస్తున్నారు. గతంలో మంచినీటి నల్లాల కాడ కనిపించే దశ్యం ఇప్పుడు టీఎస్ ఆర్టిసి బస్సుల్లో కనిపిస్తోంది. మహిళలు సీట్ల కోసం సిగపట్లు పట్టుకోవడం ఆర్టిసి బస్సుల్లో తరచూ జరుగుతోంది.
తాజాగా బస్సులో సీటు కోసం మహిళలు గొడవపడ్డ వీడియో ఒకటి బయటకు వచ్చింది. హైదరాబాద్ నుండి దుబ్బాకకు ప్రయాణికులతో ఓ ఆర్టిసి బస్సు బయలుదేరింది. మహిళా ప్రయాణికులే ఎక్కువగా వుండటంతో వారికి కేటాయించిన సీట్లన్ని ఫుల్ అయ్యాయి. ఈ క్రమంలోనే సీటు విషయంలో ఇద్దరు మహిళల మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. ఇంకేముంది అందరూ ఆపుతున్నా వినకుండా ఇద్దరు మహిళలు తిట్లపురాణం అందుకుని చెప్పులతో పరస్పర దాడులు చేసుకున్నారు.
మహిళల గొడవను బస్సులోనివారు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో ఆ ఇద్దరు మహిళలనే కాదు యావత్ మహిళా లోకంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. రెండు కొప్పులు ఒకే చోట ఇమడలేవు అనే సామెతను గుర్తుచేస్తున్నారు. మహిళలకు మంచి చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని అమలుచేస్తున్నా కొందరు మహిళల ఓవరాక్షన్ ఇది అభాసుపాలు అవుతోందని అంటున్నారు. ఈ ఉచిత ప్రయాణంతో బస్సులన్నింటిని ఆక్రమిస్తున్న మహిళలే ఇలా సిగపట్లకు దిగుతున్నారు... మరి సీట్లు దొరక్క ఇబ్బంది పడుతున్న పురుషుల పరిస్థితి ఏమిటని మగరాయుళ్లు ప్రశ్నిస్తున్నారు. మహిళలకు కేటాయించినట్లే పురుషులకు కూడా ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని సరదాగానో లేక సీరియస్ గానో కామెంట్స్ మాత్రం చేస్తున్నారు.
Also Read TSRTC Mahalakshmi : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సామాన్యుడి సవాాల్... హైకోర్టులో పిల్
ఇక కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలవారు బస్సుల్లో మహిళల గొడవలపై సెటైర్లు వేస్తున్నారు. మహిళల సిగపట్లు పట్టుకోవడం అనే అంతరించిపోతున్న కళను రేవంత్ సర్కార్ ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా తట్టి లేపిందని అంటున్నారు. మహాలక్ష్మి పథకంతో మహిళల మధ్య చిచ్చు పెడుతున్నారు... సీట్ల కోసం కొట్టుకుచావండి... మేం వేడుక చూస్తాం అనేలా కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారతీరు వుందని ప్రతిపక్షాలు గరం అవుతున్నాయి.