TSRTC Mahalakshmi : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సామాన్యుడి సవాాల్... హైకోర్టులో పిల్
ఆరు గ్యారంటీ హామీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న మహాలక్ష్మి పథకాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజం దాఖలయ్యింది.
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఆర్టిసి బస్సుల్లో మహిళలకు ఉచితంగానే ప్రయాణించే సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ సర్కార్ అమలుచేస్తున్న ఈ 'మహాలక్ష్మి' పథకంపై హైకోర్టులో పిల్ దాఖలయ్యింది. ఈ పథకం అమలుకోసం డిసెంబర్ 8న రేవంత్ సర్కార్ జారీచేసిన జీవో 47ను సవాల్ చేస్తూ ఓ ప్రైవేట్ ఉద్యోగి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజం (పిల్) దాఖలు చేశాడు. ప్రతివాదులుగా తెలంగాణ రవాణశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టిసి ఛైర్మన్ తో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని చేర్చాడు.
అసలు మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని ఆర్టిసిని ఆదేశించే అధికారమే తెలంగాణ ప్రభుత్వానికి లేదని ప్రైవేట్ ఉద్యోగి హరేందర్ కుమార్ హైకోర్టుకు తెలిపాడు. ఆర్టిసి కేంద్ర చట్టాల ద్వారా ఏర్పడిన సంస్థ... కాబట్టి రాష్ట్ర నిర్ణయాలు చెల్లవని తెలిపాడు. అంతేకాదు మహిళలకు ఉచిత ప్రయాణం వివక్షతో కూడిన నిర్ణయమని తన పిల్ లో పేర్కొన్నాడు హరేందర్ కుమార్.
ఇక రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల ఆర్టిసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగిందని హైకోర్టుకు తెలిపాడు హరీందర్. దీంతో మిగతా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపాడు. కాబట్టి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయంపై పునరాలోచన చేసేలా ఆదేశాలు ఇవ్వాలని హరేందర్ కుమార్ తన ఫిల్ లో పేర్కొన్నాడు.
ఇదిలావుంటే ఇప్పటికే మహాలక్ష్మి పథకం తమ పొట్టకొడుతోందని ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తుండటంతో గిరాకీలు లేక ఇబ్బందిపడుతున్నామని ప్రైవేట్ వెహికిల్స్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరీముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఈ పథకం అమలు తర్వాత తమ కుటుంబ పోషణ కూడా భారంగా మారిందని అంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆటోవాలాలు ఆందోళనలు, నిరసనలు కూడా చేపట్టారు.
ఇక ఉచితంగా ప్రయాణం చేస్తున్న మహిళలు బస్సుల్లో గొడవపడటం ఎక్కువయ్యింది. సీట్ల కోసం మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకున్న వీడియోలు బయటకు వచ్చాయి. అలాగే మహిళలతో బస్సులు కిక్కిరిసిపోవడంతో తాము తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు కొందరు పురుష ప్రయాణికులు చెబుతున్నారు. మహిళా ప్రయాణికులతో ఆర్టిసి సిబ్బంది కూడా ఇబ్బందిపడుతున్న వీడియోలు బయటకు వచ్చాయి.