హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదని నిలదీశారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ వచ్చిందని తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆర్టీసీ విలీనంపై ఐఏఎస్ అధికారులతో కమిటీ కూడా వేసిన విషయాన్ని గుర్తు చేశారు. 

ఆనాడు తాము ఇచ్చిన నోటీసును సైతం పట్టించుకోలేదని తెలిపారు. ఇప్పటికీ తాము చేసిన డిమాండ్లు, ఆనాడు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక తమ వద్ద ఉందని తెలిపారు ఆర్టీసీ జేఏసీ కార్మికులు తెలిపారు. 

ఇప్పటికైనా తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్టీసీ విలీనంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సైతం పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారని తమ సేవలను కూడా గుర్తించాలని కార్మిక సంఘాల నేతలు కోరారు. 

సమ్మెను నివారించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సమ్మె చేపట్టాలన్నది తమ అభిమతం కాదని అయితే తమ డిమాండ్ల సాధన కోసం తప్పని సరి పరిస్థితుల్లో ఈ పరిస్థితికి వచ్చిందన్నారు. దాన్ని నివారించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని టీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలు సూచించారు. 

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే దూర ప్రాంతాలకు సంబంధించి సర్వీసులు నిలిచిపోయాయని తెలిపారు. సాయంత్రం మూడు గంటల నుంచి మరిన్ని దూర ప్రాంత సర్వీసులు నిలిచిపోతాయని తెలిపారు. 

ఈ వార్తలు కూడా చదవండి

నేటి అర్థరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె : ఐఏఎస్ కమిటీతో చర్చలు విఫలం